అత్యవసర సేవలకోసం ఏర్పాటు చేసిన 108 ఇప్పుడు మరోరకంగా మారిపోయింది! ఈ నెంబరును ఒక ఉద్దేశ్యంతో ఏర్పాటూ చేస్తే… ఈ కరోనా పుణ్యమాని ఏర్పడిన లాక్ డౌన్ నేపథ్యంలో జీవీకేఈఎంఆరై సంస్థ ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్ ఫోన్ నంబరుకు వస్తున్న ఈ కొత్త కాల్స్ కి అధికారులే విస్తుపోతునారంటే అర్ధం చేసుకోవచ్చు. ఇంక దాచేది లేదు… విషయంలోకి వెళ్లిపోదాం!
లాక్‌డౌన్ సమయంలో మానసిక ఇబ్బందులు ఎదుర్కొనే వారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఉద్దేశించి జీవీకే-ఈఎంఆర్‌ఐ సంస్థ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ఫోన్ నంబరు 108కు వస్తున్నకొత్తరకం ఫోన్ కాల్స్ చూసి అధికారులు విస్తుపోతున్నారట. ఈ నంబరుకు ఫోన్ చేస్తున్న మెజారిటీ ప్రజలు… మద్యం షాపుల ఓపెనింగ్స్ గురించి అడుగుతున్నారట. అవును… 108కి వస్తున్న ఫోన్ కాల్స్ లో దాదాపు 80 శాతం మంది మద్యం షాపులు తెరవాలని కోరుతున్నారట.
ఈ ఫోన్స్ చేస్తున్న జనాలు… “మందు లేక చనిపోవాలనిపిస్తోంది.. అర్జెంటుగా దుకాణాలు తెరవండి” అని అభ్యర్థిస్తున్నారట. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మద్యానికి బానిసైన కొందరు అది కాస్తా దొరక్కపోయే సరికి వింత వింతగా ప్రవర్తిస్తుండగా.. మరికొందరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ విషయంలో వింతగా ప్రవర్తిస్తున్నవారితో ఎర్రగడ్డ మెంటల్ హాస్పటల్ తో పాటు జిల్లాలోని పలు ఆసుపత్రులు నిండిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమకు వస్తున్న ఫోన్ కాల్స్‌కు ఏమని సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని కాల్ సెంటర్ అధికారులు పోలీసులకు చెబుతున్నారట. అయితే… ఈ విషయాలపై స్పందించిన వైద్యులు మాత్రం… మద్యానికి బానిసైన వారు దానిని తీసుకోకపోతే కనిసంగా మూడు వారాల తర్వాత వారిలో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారట. అంతేనా… ఇలా మానసిక సమస్యలు వచ్చినవారిలో సుమారు 20 శాతం మందికి పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని కూడా మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారట. ఈ విషయాలు తెలుసుకున్నవారు మాత్రం “ఎంతపనిచేశావ్ కరోనా”… అని తెగ ఫీలయిపోతున్నారట!