ఏం చేసినా విమర్శిద్దాం! అని ఒక సిద్ధాంతం తీర్మానించుకున్న వారికి ఏదైనా ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఏపీ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం అనేకం చేస్తోంది. అదేసమయంలో కరోనా వల్ల సాధారణ జనజీవ నం ఇబ్బందులు పడకుండా చూడాలని కూడా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా విజృంభణ లేని ప్రాంతాల్లో లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇక, దక్షిణ కొరియా నుంచి కేవలం పదంటే పది నిముషాల్లో కరోనా ఉందో లేదో చెప్పే టెస్టింగ్ కిట్లను కూడా సమకూర్చుకుంది. వీటికితోడు .. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నిత్యం ఫోన్ చేస్తూ.. ప్రజల ఆరోగ్యాన్ని పరిశీలిస్తోంది.
ఇక, పేదలకు ఇప్పటికే నెలకు రెండు సార్లు నిత్యావసరాలు ఇచ్చారు. అదేవిధంగా ఈ నెలలో పేదలకు రూ.1000 అదనంగా ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. వచ్చే నెలలోనూ ఇదే విధంగా అందించాలని నిర్ణ యించారు. ఇక, ప్రార్థనాలయాలు, మసీదులు, ఆలయాలు లాక్‌డౌన్‌తో మూతబడడంతో అక్కడ పూజలు చేసే, ప్రార్థనలు చేసే పూజారులు, పాస్టర్లు, మౌజన్లు ఆదాయం కోల్పోయి కుటుంబాలను పోషించుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వారికి ఏకమొత్తంగా రూ.5 వేల చొప్పున సాయం చేయాలని దీనిని నేరుగా వారి ఖాతాల్లోనే వేయాలని కూడా సీఎం జగన్ నిర్ణయించి ఆదేశించారు.
ఇలా కరోనా కష్ట కాలంలోనూ అనేక రూపాల్లో ప్రజలకు ప్రబుత్వం అండగా ఉంటోంది. కానీ, విపక్షం టీడీపీ మాత్రం వెతికి వెతికి మరీ విమర్శలు చేస్తుండడాన్ని మేధావులు, టీడీపీ సానుభూతి పరులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులను పక్కరాష్ట్రాలు సహా ఏకంగా కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చుకుంటున్నా.. వీరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.
ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా విపక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేస్తున్న పరిస్థితి కానీ, ప్రోత్సాహకంగా ఓ సూచన చేస్తున్న సందర్భం కానీ మనకు ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. మరి ఇలా అయితే, టీడీపీపై ప్రజలు ఏవగింపు పెంచుకోరా? అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలు చంద్రబాబు ఇంకా మునగడానికి కారణమవుతున్నాయని అంటున్నారు. మరి దీనికి తమ్ముళ్లు ఏం సమాధానం చెబుతారో చూడాలి.