ఎన్నికలు అనగానే నాయకులు ఓట్ల కోసం ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇస్తుంటారు. తమను గెలిపిస్తే అది చేస్తామని, ఇది చేస్తామని వాగ్దానాలతో ప్రజలకు ఊదరగొడుతుంటారు. గెలిచాక ముఖం చాటేస్తారు. తాము అలా అనలేదని, ఆ విధంగా చేస్తామని చెప్పలేదని బుకాయిస్తారు. అయితే ఈ విధంగానే ప్రజలకు బుకాయించవచ్చని అనుకున్నాడో, ప్రజలను వెర్రి గొర్రెలు అనుకున్నాడో, ఇంకో విషయమో తెలియదు.. కానీ అతను మాత్రం అసలు ఊహకందని ఎన్నికల వాగ్దానాలను ప్రజలకు ఇస్తున్నాడు.
తమిళనాడులోని దక్షిణ మదురైకి చెందిన 34 ఏళ్ల శరవణన్ అనే వ్యక్తి తాజాగా అక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ వేశాడు. అయితే అతను అసలు జనాలు ఊహించని వాగ్దానాలను ఇస్తున్నాడు. తనకు ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే ఇంటికి ఒక ఐఫోన్, ఒక కారు, హెలికాప్టర్, ఒక రోబోట్, ఒక 3 అంతస్థుల ఇల్లు, అందులో స్విమ్మింగ్ పూల్, ఇంట్లో యువత ఉంటే వారికి రూ.1 కోటి నగదు, చంద్రుడిపై 100 రోజుల వెకేషన్ వంటివి అందిస్తానని హామీ ఇస్తున్నాడు. దీంతో అతను ఇస్తున్న ఎన్నికల వాగ్దానాలను చూసి చాలా మంది షాక్‌కు గురవుతున్నారు.
సాధారణంగా నాయకులు ఎన్నికల్లో ఇచ్చే మామూలు వాగ్దానాలనే వారు గెలిచాక పట్టించుకోరు. అలాంటిది శరవణన్ అలాంటి భారీ ఖర్చుతో కూడిన హామీలను ఇస్తుండే సరికి చాలా మందికి అది నవ్వులాటగా మారింది. అయితే కొందరు మాత్రం అతను పారడీ కోసం ఇలా చేస్తున్నాడేమోనని అభిప్రాయపడ్డారు. నాయకులు ఎన్నికలప్పుడు వాగ్దానాలను ఏవిధంగా ఇస్తారు, తరువాత ప్రజలను ఎలా మోసం చేస్తారు ? అనే విషయాన్ని అతను జనాలకు వ్యంగ్యంగా చెబుతున్నాడని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా అతని ఎన్నికల వాగ్దానాలతో కూడిన మ్యానిఫెస్టో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బహుశా ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి అసాధ్యమైన హామీలను ఇవ్వలేదు కాబోలు..!!