షర్మిల ఖమ్మం సభకు కొత్త టెన్షన్

-

తెలంగాణలో రాజన్న సంక్షేమ రాజ్యం ఏర్పాటే లక్ష్యమని చెబుతున్న వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన కోసం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్ అభిమానులతో లోటస్ పాండ్ వేదికగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 21నే ఖమ్మం జిల్లాలో పర్యటించి పార్టీ పేరును ప్రకటించాల్సి ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డొచ్చింది. దీంతో ఏప్రిల్ 9న బహిరంగ సభకు కొత్త ముహూర్తం ఖరారు చేశారు. అయితే షర్మిల సభకు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుందట.

ఖమ్మంలో భారీ బహిరంగసభతో తెలంగాణ రాజకీయాల్లో అటెన్షన్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు షర్మిల. ఇందులో భాగంగా ఖమ్మం పెవీలియన్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభకు ఫోకస్‌ పెట్టారు నాయకులు. అయితే షర్మిల పార్టీకి ఆదిలోనే ఇక్కట్లు తప్పేలా లేవని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఖమ్మం బహిరంగ సభ ద్వారా పార్టీ పేరు, జెండా, అజెండా వివరించాలని భావించిన షర్మిలకు కరోనా నిబంధనలు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది.

ఖమ్మం సభకు పోలీసులు పర్మీషన్ ఇచ్చినా కరోనా సెకండ్‌ వేవ్‌.. సభలపై పెట్టే ఆంక్షలు.. కలవర పెడుతున్నాయట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలను మూసివేశారు. గతంలో కంటే ఇప్పుడు రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. కేసుల సంఖ్య పెరిగితే స్థానిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాలు ఆంక్షలు విధించేలా వెసులుబాటు కల్పించింది. దీంతో తెలంగాణలో కరోనా కేసుల కట్టడికి కఠిన ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

మరో 14 రోజుల్లో ఖమ్మంలో షర్మిల సభ జరగాల్సి ఉండగా కరోనా కేసులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఏప్రిల్ 9న లక్ష మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినా సభకు ఆంక్షలు అడ్డొస్తే ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారట. ఒక వేళ మరీ క్లిష్టమైన ఆంక్షలు విధిస్తే సభను వాయిదా వేసే యోచనలో కూడా ఉన్నారట. అలాగే భారీగా జన సమీకరణ వల్ల కరోనా ప్రభలే ప్రమాదం ఉండడంతో.. దానికి ఎదురెళ్లే అవకాశం లేదని చెబుతున్నారు. అదే జరిగితే ఖమ్మం సభకు కొత్త తేదీని ప్రకటిస్తారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news