గంటా సంచలనం : నా రాజీనామా వలన ఉప ఎన్నికలు వస్తే పోటీ చేయను !

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా నేను చేసిన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ ను కోరానని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాజీనామాను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్న ఆయన అమరావతి వెళ్లిన తర్వాత నాలుగు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారని అన్నారు. తెలుగు ప్రజల గుండె చప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అని, ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం పూర్తి స్థాయిలో సిద్ధమైందని అన్నారు. కేంద్ర మంత్రులు, ప్రధాని పార్లమెంట్ సాక్షిగా చెప్పిన మాటలే అందుకు నిదర్శనం అని అన్నారు. చివరి అస్త్రంగా రాజీనామాలే శరణ్యం అని పేర్కొన్న ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రితో సహా రాజీనామాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

అందరూ ఒకేసారి రాజీనామాలు చేస్తే ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతుందని, వయసులో పెద్దవారు అయినప్పటికీ చంద్రబాబు స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ చొరవ తీసుకుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఉద్యమించాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ తెలుగు రాష్ట్రాల సమస్యగా కేటీఆర్ చూశారని, ప్రత్యక్ష ఉద్యమంలో కేటీఆర్ పాల్గొంటానని హామీ ఇచ్చారని అన్నారు. ఈనెల 26 తర్వాత కేటీఆర్ విశాఖ వచ్చే అవకాశం ఉందని, పార్టీలకు అతీతంగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నార్త్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే నేను పోటీ చేయనని, అలా పోటీ చేస్తే నా రాజీనామాకు అర్థం ఉండదని అన్నారు. ఎన్నికలు వస్తే … స్టీల్ ప్లాంట్ తరపున ఉమ్మడి అభ్యర్థిని పోటీలో నిలపాలని భావిస్తున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news