టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న విమానం.. కిందకు దూసుకొచ్చిన కారు

-

ఇటీవలే ఓ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఇండిగో ఎయిర్ లైన్స్ ఇవాళ మరో ప్రమాదం నుంచి జస్ట్ మిస్ అయింది. గోఫస్ట్ ఎయిర్ లైన్ కు చెందిన ఓ కారు.. ఇండిగో ఏ320 నియో విమానం కిందకు వెళ్లింది. విమానం ముందు చక్రాల ముందు ఆగింది. త్రుటిలో విమానాన్ని ఢీకొట్టే ప్రమాదం నుంచి తప్పించుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దిల్లీ ఎయిర్​పోర్ట్ టీ2 టెర్మినల్​లోని 201వ స్టాండ్​లో ఈ ఘటన జరిగింది. దీనిపై డీజీసీఏ దర్యాప్తు జరుపుతోంది.

విమానం మంగళవారం ఉదయం దిల్లీ నుంచి పట్నాకు బయల్దేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే స్విఫ్ట్ డిజైర్ కారు దూసుకొచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు వివరించారు. విమానానికి కూడా ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశాయి.

ఘటన అనంతరం విమానం యథాతథంగా ప్రయాణం సాగించిందని, షెడ్యూల్ ప్రకారమే బయల్దేరిందని వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై డీజీసీఏ రంగంలోకి దిగింది. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొంది.

ఇటీవలే ఇండిగో విమానం త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. అసోం జోర్హాట్​ విమానాశ్రయం నుంచి కోల్‌కతా వెళ్లేందుకు బయల్దేరిన ఇండిగో విమానం టేకాఫ్‌ అవుతుండగా రన్‌వే పై నుంచి జారింది. రెండు టైర్లు పక్కనే ఉన్న బురదలో చిక్కుకుపోయాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పైలట్లు అప్రమత్తమై విమానాన్ని నిలిపివేశారు. మరో విమానంలో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news