ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తూర్పు గోదావరి జిల్లా రాజోలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తాజాగా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ నాయి బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడారని నాయి బ్రాహ్మణ సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మను అరెస్ట్ చేయాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు. పవర్ స్టార్ సినిమా విషయంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు,ఆయనకు మధ్య తలెత్తిన వివాదంలో అనవసరంగా తమ కుల ప్రస్తావన తీసుకొచ్చారని మండిపడ్డారు.
వర్మ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవలి కాలంలో చాలామంది ప్రముఖులు తమ కులాన్ని కించపరచడం,ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం కామన్‌గా మారిపోయిందన్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే తమ కులాన్ని కించపరిచేవారిపై అట్రాసిటీ చట్టం పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాంగోపాల్ వర్మ మరోసారి తమ కులాన్ని కించపరిస్తే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. తమ కులాన్నే కాదు… ఏ కులాన్ని కించపరవద్దని హితవు పలికారు.