కరోనా వైరస్ నివారణ కోసం కరోనిల్ పనిచేస్తుందని మంగళవారం పతంజలి డ్రగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పతంజలి అలా ప్రకటించిందో లేదో.. దానిపై వివాదం మొదలైంది. అదే రోజు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ మందుపై ప్రకటనలు ఇవ్వొద్దని, దాని తయారీ, క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. అయితే రాందేవ్ బాబా ఈ మందును విడుదల చేసే సమయంలో దీనిని హరిద్వార్‌లోని పతంజలి రీసెర్చ్ సెంటర్, జైపూర్ లోని నిమ్స్‌తో కలిసి తయారు చేసినట్లు ప్రకటించారు.
అయితే నిమ్స్ హాస్పిటల్ క్లినికల్ ట్రయల్స్ గురించి తెలియడంతో రాజస్థాన్ ప్రభుత్వం దాని యాజమాన్యానికి నోటీసులు ఇచ్చింది. అయితే తాజాగా.. రాందేవ్ బాబాపై రాజస్థాన్ లో చీటింగ్ కేసు నమోదైంది. కరోనాకు మందు పేరుతొ ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలతో ఫిర్యాదు చేయడంతో సెక్షన్-420 కింద చీటింగ్ కేసు నమోదు చేశారు జైపూర్ పోలీసులు. రాందేవ్ బాబా, బాలకృష్ణ సహా మరో ఐదుగురిపై కేసు నమోదయింది. కరోనాను కరోనిల్ నివారిస్తుందని ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.