కరోనా వల్ల ఓ వైపు ప్రజలు బెంబేలెత్తిపోతుంటే.. మరో వైపు విద్యుత్ శాఖ అధికారులు వేస్తున్న బిల్లులు సామాన్యులకు కరెంటు షాకును మించి భయపెట్టిస్తున్నాయి. చిన్న చిన్న ఇళ్లకే అధికారులు లక్షల రూపాయల కరెంటు బిల్లు వేస్తుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఇలాంటిదే మరొక సంఘటన చోటు చేసుకుంది.
రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన శీలం సదయ్య పశువులను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి 2 గదులు ఉన్న చిన్న రేకుల ఇల్లు ఉంది. అందులో 2 బల్బులు, ఒక ఫ్యాన్, ఒక చిన్న టీవీ మాత్రమే ఉన్నాయి. అయితే అతని ఇంటికి ఏకంగా రూ.1.80 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. దీంతో సదయ్యకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చినంత పనైంది. ఈ క్రమంలో అతను ఆ కరెంటు బిల్లుపై విద్యుత్ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.
విద్యుత్ సిబ్బంది ఇచ్చిన కరెంటు బిల్లు చెల్లించేందుకు తన ఇంటిని అమ్మినా సరిపోదని సదయ్య వాపోతున్నాడు. ఆ బిల్లును సరి చేసి ఇవ్వాలని అధికారుల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. అయినా వారు కనీసం స్పందించడం లేదు సరికదా.. లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉండి బాగా ఫ్యాన్, టీవీ వాడినట్టున్నారు, అందుకే కరెంటు బిల్లు అంత వచ్చి ఉంటుందని అతన్ని ఎగతాళి చేస్తున్నారు. దీనిపై తనకు న్యాయం చేయాలని, తనకు ఏం చేయాలో పాలుపోవడం లేదని, మరోవైపు బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తారేమోనని భయంగా ఉందని అతను దిగులు చెందుతున్నాడు. ఇదీ.. విద్యుత్ శాఖ నిర్వాకం.. ఇక ముందు ముందు ఇలాంటి సంఘటనలను ఎన్నింటిని చూడాల్సి వస్తుందో..!