ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. అయితే సిబిఐ జారీ చేసిన ఈ నోటీసులపై మనిష్ సిసోడియా స్పందించారు. ఇంతకుముందు నిర్వహించిన సోదాలలో సిబిఐ కి ఎటువంటి ఆధారం దొరకలేదని.. అందుకే ఇలాంటి చర్యలకు దిగుతుందని విమర్శించారు. అయినప్పటికీ దర్యాప్తు సంస్థ విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పారు మనిష్.
డిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మనిష్ సిసోడియా నివాసం, ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపికృష్ణ నివాసాలతో సహా 21 ప్రాంతాలలో సిబిఐ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో 15 మంది నిందితులలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి కూడా ఒకరు. కొత్త మద్యం పాలసీలో నిబంధనలను ఉల్లంఘించడం, విధానపరమైన లోపాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.