ఆంధ్రప్రదేశ్ గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని, అలానే మరి కొందరు ప్రైవేటు వ్యక్తులకు చెందిన ఇల్లు ఆఫీసులు కలిపి మొత్తం 25 చోట్ల సీబీఐ ఈ రోజు సోదాలు నిర్వహించింది. దర్యాప్తు కొనసాగుతున్న ఓ కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగాయని సీబీఐ ప్రకటించింది. ఈ సోదాల్లో సిబీఐ అనేక నేరారోపణ పత్రాలు, మొబైల్ ఫోన్లు, భౌతిక వస్తువులు, నగదు ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ మరియు డిఓపిటి జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన సిబిసిఐడి నుంచి 17 అక్రమ సున్నపురాయి తవ్వకాల కేసులను దర్యాప్తుని సీబీఐ స్వాధీనం చేసుకుంది. అలాగే, 17 మంది నిందితులపై ఈ ఏడాది ఆగస్టు 26న కేసు నమోదు చేసింది.
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలంలోని కోనంకి గ్రామం, దాచేపల్లి మండలంలో కేశానుపల్లి, నడికూడి గ్రామాలలో కొన్ని సంవత్సరాల పాటు నిందితులు మోసపూరితంగా, అనుమతులు లేకుండా గనుల తవ్వకాలు జరిపి, సున్నపురాయు ను స్వాధీనం చేసుకొని అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. తద్వారా, ప్రభుత్వానికి, ఇతర లైసెన్స్డ్ లీజ్ హోల్డర్లకు ఆదాయ నష్టం కలిగించడమే కాకుండా, సహజ వనరుల దోపిడికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. 2014 నుంచి 2018 వరకు అనేక లక్షల టన్నుల సున్నపురాయి అక్రమ తవ్వకాలకు పాల్పడడం ద్వారా, కోట్లాది రూపాయల సహజ వనరులను దోచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు లేని, అక్రమ తవ్వకాల పరిమాణాన్ని నిర్ధారించడానికి, శాటిలైట్ ఇమేజెస్ ఉపయోగించడం ద్వారా సీబీఐ వాల్యూ మెట్రిక్ విశ్లేషణను కూడా చేస్తోంది.