ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరోనా లాక్ డౌన్ మొదలయిన నాటి నుంచి హైదరాబాద్లోని తన ఇంటికే పరిమితం అయిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన అమరావతిలోని ఉండవల్లి నివాసానికి వెళ్లారు. కొద్ది రోజుల నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. అయితే రేపు దీపావళి పండుగ ఉండడంతో ఆయన హైదరాబాద్ లోని తన నివాసానికి బయలు దేరారు.
అయితే నల్గొండ జిల్లా నార్కట్ పల్లి కామినేని హాస్పిటల్ సమీపానికి వచ్చాక సాంకేతిక లోపంతో ఆయన ప్రయాణిస్తున్న కారు ఆగిపోయింది. అయితే చాలా సేపు కార్ లోనే ఉన్నా ఆయన కారు ఇక ఇప్పుడు బాగవదని తెలుసుకుని మరో వాహనంలో హైదరాబాద్ బయలు దేరి వెళ్లారు. అయితే ఈ ఘటన మీద టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి కార్లు పంపే ముందు ప్రభుత్వం సరిగా చెక్ చేసుకోదా అని వారు ప్రశ్నిస్తున్నారు. మాజీ సీఎం స్థాయి వ్యక్తికి ఇలాంటి పరిణామాలు ఎదురైతే ఆయన భద్రతకే ప్రమాదం వాటిల్లుతుందని వాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.