‘జోషీమఠ్‌’ పగుళ్ల వెనుక అనేక కారణాలు : సీబీఆర్‌ఐ డైరెక్టర్‌

-

ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌ ప్రాంతంలో పగుళ్లు రావడం వెనుక ఎన్నో కారణాలున్నాయని రూర్కీలోని సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీబీఆర్‌ఐ) డైరెక్టర్‌ డాక్టర్‌ రమన్‌చర్ల ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. ఈ ప్రాంతం సబ్సిడెన్సీ జోన్‌ పరిధిలో ఉందని వెల్లడించారు. ప్రస్తుతం జోషీమఠ్‌లో దెబ్బతిన్న భవనాల కూల్చివేత, పునరావాస చర్యల బాధ్యతను ప్రభుత్వం సీబీఆర్‌ఐకి అప్పగించింది. దీనికి తెలుగు వ్యక్తి ప్రదీప్‌ కుమార్‌ సంచాలకుడిగా ఉన్నారు. అక్కడి పరిస్థితులపై ఆయన మాట్లాడారు.

“ఈ ప్రాంతం సబ్సిడెన్సీ(మెల్లమెల్లగా కుదించుకుపోయే) జోన్‌ పరిధిలో ఉంది. వర్షాలతో కొండల్లోని పలచటి పొరల్లోకి నీరు చేరి పటుత్వం తగ్గుతోంది. హిమానీనదాలు కరగడంతో పాటు సహజసిద్ధమైన నీటి ప్రవాహానికి అడ్డుకట్ట పడటంతో భూమి గుల్లబారి కుదించుకుపోతోంది. ఇక్కడా ఈ అంశాలను కారణాలుగా చెప్పవచ్చు. కొండ ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు జరగడం సాధారణమే. జనావాసాలు ఉండటంతో జోషీమఠ్‌పై అందరి దృష్టి పడింది. కొన్నేళ్లుగా అక్కడ ఆవాసాలు పెద్దఎత్తున వచ్చినా అదొక్కటే కారణమని చెప్పలేం. సమస్యకు మూలాలను గుర్తించే పనిలో ప్రభుత్వరంగ సంస్థలు నిమగ్నమయ్యాయి.” అని ప్రదీప్ కుమార్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news