సీబీఎస్ఈ విద్యార్థులకు అలెర్ట్. 2024 విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా సీబీఎస్‌ఈ పరీక్షల క్రమంలో మార్పులు చేయాలని నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌సీఎఫ్) ముసాయిదా కమిటీ ప్రతిపాదించింది.
ఇస్రో మాజీ అధినేత కె.కస్తూరిరంగన్ నేతృత్వంలోని ఈ కమిటీ ప్రతిపాదించిన మేరకు.. సీబీఎస్‌ఈ 12వ తరగతిలో రెండు టర్ముల్లో పరీక్షలు నిర్వహించే విధానం మళ్లీ రావచ్చు. అలాగే 10, 12 తరగతుల వార్షిక పరీక్షల ఫలితాల్లో గత తరగతుల మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రస్తుతం 11, 12 తరగతుల కోసం పాఠ్యాంశాలను సైన్స్, ఆర్ట్స్/హ్యుమానిటీస్, కామర్స్‌లుగా విభజిస్తున్న విధానాన్ని కూడా తొలగించాలని కమిటీ ప్రతిపాదించింది. సాధారణంగా గణితమంటే విద్యార్థుల్లో ఉన్న భయం పోగొట్టేందుకు మ్యాథ్స్‌ను కళలు, క్రీడలు, భాషతో అనుసంధానించాలని కమిటీ ప్రతిపాదించింది. బాలికలకు గణితంలో సామర్థ్యం ఉండదనే సామాజిక అపోహను తొలగించాలని కూడా సూచించింది. కమిటీ ప్రతిపాదించిన ఈ కొత్త విధానం 2024 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. ముందుగా ముసాయిదాపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటామని కేంద్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు.