ఈనెల 8న సింగరేణిలో మహాధర్నాకు BRS పిలుపు

-

కేంద్రంపై బీఆర్ఎస్ మరోసారి పోరుబాట పట్టనుంది. ఈసారి ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటిస్తున్న రోజే ధర్నా చేయాలని నిర్ణయించింది. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల8న సింగరేణి ప్రాంతంలో మహాధర్నాకు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించి చేతులు దులిపేసుకోవాలనే కుట్రలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతోందని కేటీఆర్‌ మండిపడ్డారు. బొగ్గు గనుల వేలానికి కేంద్రం తాజాగా మరోసారి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీస్థాయిలో మహా ధర్నాలు చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ నెల 8న మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండంలలో పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు.

సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని తెలంగాణ ప్రభుత్వం అనేకమార్లు విజ్ఞప్తి చేసినా.. కేంద్రం కుట్రపూరితంగా సత్తుపల్లి బ్లాక్‌-3, శ్రావణపల్లి, పెనగడప గనుల వేలం కోసం మరోసారి నోటిఫికేషన్‌ ఇచ్చిందని కేటీఆర్ మండిపడ్డారు. మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియ నిర్వహించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేలంతో సంబంధం లేకుండా సింగరేణికి గనులను కేటాయించాలని కేటీఆర్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news