కేంద్రంలోని మోదీ ప్రభుత్వం త్వరలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం రైతులకు ఏడాదికి రూ.6వేలను కిసాన్ సమ్మాన్ నిధి కింది వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. కానీ ఈ మొత్తాన్ని త్వరలో రూ.10వేలకు పెంచనున్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంపై ప్రకటన చేస్తారని తెలిసింది.
ఏడాదికి ఇస్తున్న రూ.6వేలను 3 దశల్లో ఒక్కో దశకు రూ.2వేల చొప్పున ఇస్తున్నారు. అయితే ఇది ఏమాత్రం సరిపోవడం లేదని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు కేంద్ర మంత్రులకు తెలిపినట్లు తెలిసింది. అందువల్లే ఆ మొత్తాన్ని రూ.10వేలకు పెంచుతారని సమాచారం అందుతోంది. కాగా కేంద్ర ప్రభుత్వం పలు రైతు పథకాలకు ప్రతి ఏటా మంజూరు చేస్తున్న మొత్తాలను పెంచుతూ వస్తోంది. అందులో భాగంగానే ఈసారి కిసాన్ సమ్మాన్ పథకానికి నిధులను ఎక్కువగా ప్రకటిస్తారని తెలుస్తోంది.
2018 డిసెంబర్ 1వ తేదీన కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించగా ఇందులో 11.47 కోట్ల మంది లబ్ధిదారులకు ఏడాదికి 3 విడతలుగా ఒక్కో విడతకు రూ.2వేలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని రూ.10వేలకు పెంచుతూ ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.