కంపెనీలు తమ సీఎస్‌ఆర్ నిధులను ‘’హర్ ఘర్ తిరంగా’’కు సంబంధించిన కార్యకలాపాల కోసం ఖర్చు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రజల హృదయాలలో దేశభక్తి భావనను ప్రేరేపించడం, భారత జాతీయ జెండాపై ప్రజల్లో అవగాహనను పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ఉత్తర్వులో పేర్కొంది.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగరేయాలని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
కంపెనీల చట్టం, 2013 ప్రకారం, కంపెనీలు తమ మూడేళ్ల వార్షిక సగటు నికర లాభంలో కనీసం రెండు శాతాన్ని ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)’ కార్యకలాపాలకు కేటాయించాల్సి ఉంటుంది. కంపెనీల చట్టంలోని షెడ్యూల్ VII నిబంధనల ప్రకారం సాంస్కృతిక విద్యను ప్రోత్సహించడానికి సంబంధించిన కార్యకలాపాలకు సీఎస్‌ఆర్ నిధులను వినియోగించే వెసులుబాటు ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వం గుర్తుచేసింది.