త్వ‌ర‌లో కొత్త అద్దె ఇళ్ల చ‌ట్టం అమ‌లులోకి.. ఇండ్ల‌ను వెంట‌నే ఖాళీ చేయించ‌డం ఇక‌పై కుద‌ర‌దు..!

835

ఇండ్ల యజమానులు, కిరాయి దారుల మధ్య నెలకొనే సమస్యలను, వివాదాలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ ని రెంట్‌ అథారిటీగా నియమిస్తూ కొత్త చట్టంలో నిబంధనలను రూపొందించనున్నారు.

ఉపాధి కోసం.. ఉద్యోగ అవకాశాల కోసం.. సొంత ఊర్ల‌ను విడిచి పెట్టి పట్టణాలు, నగరాలకు వలస వెళ్లి బ్రతికే సగటు పౌరులకు అద్దె ఇండ్ల‌ను వెతుక్కోవడం.. యజమానులు చెప్పినంత అద్దె చెల్లించి, వారు విధించే కఠినమైన నిబంధనలను తట్టుకొని జీవించ‌డం ఎంత క‌ష్టంగా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఈ క్రమంలో ఒక్కోసారి ఇంటి యజమానులు పెట్టే అనేక‌మైన‌ ఇబ్బందులను కూడా కిరాయిదారులు తట్టుకోవాల్సి వస్తుంటుంది. అద్దె విషయంలో, ఇతర ఏదైనా అంశంలో ఒక్కోసారి యజమానులకు, కిరాయిదారులకు గొడవలు కూడా జ‌రుగుతుంటాయి. అయితే అంతిమంగా నష్టపోయేది మాత్రం కిరాయిదారులే. ఉన్నపళంగా ఇంటిని ఖాళీ చేస్తే మళ్లీ కొత్త ఇల్లు దొరికే వరకు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే ఇకపై ఇలాంటి ఇబ్బందులు తొలగ‌నున్నాయి. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త అద్దె ఇళ్ల‌ చట్టాన్ని అమలులోకి తేనుంది.

ఇళ్ల యజమానులకు, కిరాయిదారులకు మధ్య ఉండే హక్కులు, చట్టాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక చట్టాన్ని అమ‌లులోకి తేనుంది. అందులో భాగంగానే ఒక బిల్లును కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తయారుచేసింది. ఈ క్రమంలోనే ఈ బిల్లుపై ప్రజల అభిప్రాయాలను కూడా కేంద్ర తీసుకోనుంది. కాగా ఈ బిల్లుకు చెందిన ముసాయిదా చట్టంలో పలు అంశాలను కూడా పొందుపరిచారు. ఈ క్రమంలోనే ఒకసారి ఈ బిల్లు గనుక చట్టరూపం దాలిస్తే దాన్ని రాష్ట్రాలు కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురానున్న కొత్త అద్దె ఇళ్ల‌ ముసాయిదా చట్టంలో ఇంటి యజమానులకు, కిరాయిదారులకు ఇబ్బందులు ఎదురు కాకుండా పలు నిబంధనలను పొందు పరచనున్నారు. దాని ప్రకారం ఇకపై కిరాయి దారులు 2 నెలల అడ్వాన్స్ ను ఇంటిని అద్దెకు తీసుకునే స‌మ‌యంలో చెల్లించాల్సి ఉంటుంది. అదే వాణిజ్య నిర్మాణాలకు అయితే ఒక నెల అడ్వాన్స్ అద్దె కింద ఇస్తే సరిపోతుంది. ఇక యజమానులు ఇంటిని ఖాళీ చేయించాల‌నుకుంటే కిరాయి దారులకు 3 నెలల ముందుగానే నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే యజమానులు, కిరాయిదారులు కచ్చితంగా రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది లేకుండా ఎవరికీ ఇళ్లను అద్దెకు ఇవ్వకూడదని కొత్త చట్టంలో కొన్ని నిబంధనలు పెట్టనున్నారు. అలాగే రెంటల్ అగ్రిమెంట్ ముగిశాక కూడా కిరాయిదారులు నిర్మాణాల్లో కొనసాగితే మూడు రెట్ల‌ కిరాయి చెల్లించాలనే నిబంధనను కూడా ఆ చట్టంలో పొందు పరచనున్నారు. ఈ క్రమంలో యజమానులు కిరాయిదారులపై ఇలాంటి ఒత్తిళ్లు, దౌర్జన్యాల‌కు పాల్పడేందుకు వీలుండదు. అలాగే కిరాయిదారులు కూడా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. యజమానులపై వారు కూడా దౌర్జన్యం చేసేందుకు అవకాశం ఉండదు.

READ ALSO  మూత‌ప‌డ‌నున్న బీఎస్ఎన్ఎల్..? ఉద్యోగుల భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌క‌మే..?

ఇండ్ల యజమానులు, కిరాయి దారుల మధ్య నెలకొనే సమస్యలను, వివాదాలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ ని రెంట్‌ అథారిటీగా నియమిస్తూ కొత్త చట్టంలో నిబంధనలను రూపొందించనున్నారు. ఈ క్రమంలో యజమాని, కిరాయి దారుల మధ్య ఒప్పందం కుదిరాక 2 నెలల లోపు తమ రెంటల్ అగ్రిమెంట్ గురించి రెంట్ అథారిటీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో వారం లోపు యజమాని, కిరాయిదారులకు ఒక ఐడీ నంబ‌ర్ ని ఇస్తారు. దీనివల్ల కిరాయి దారులు, యజమానులు తమకు కలిగే సమస్యలను త్వరగా పరిష్కరించుకునేందుకు వీలు కలుగుతుంది.

ప్రస్తుతం పట్టణీకరణ, నగరీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు వలస వెళ్లే ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, ఇతర రంగాలకు చెందిన వారు షాపులను, ఇండ్లనును అద్దెకు తీసుకుంటే కొత్త చట్టం వారికి రక్షణగా నిల‌వ‌నుంది. అదే సమయంలో యజమానులకు న్యాయం జరుగుతుంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా అంతటా ఒకే అద్దె విధానం అమలులో ఉంటుంది కనుక అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న అద్దె ఇళ్ల‌ చట్టం యజమానులను, కిరాయిదారుల‌ను భయపెట్టే విధంగా ఉండడంతో కేంద్రం ఈ కొత్త చట్టానికి మెరుగులు దిద్దుతోంది. ఈ క్రమంలోనే కేంద్రం.. ప్రజలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఈ చట్టంపై అభిప్రాయాలను కోరుతోంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా ఈ కొత్త చట్టానికి ఆమోదముద్ర లభించనుంది. అందుకు మరికొంత కాలం పట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ కొత్త చట్టం వస్తే యజమానులకు, కిరాయిలుదారులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది.