ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులకి గుడ్ న్యూస్. ఉద్యోగులకు పెన్షన్ భారీగా పెరగనుంది. NPS (నేషనల్ పెన్షన్ స్కీమ్ | National Pension Scheme) కింద బ్యాంకు యజమాని అందించే సహకారాన్ని పెంచే ప్రతిపాదనకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
బ్యాంకు ఉద్యోగి చివరగా తీసుకున్న జీతంలో 30 శాతం యూనిఫాం స్లాబ్‌లో పెన్షన్ పొందనున్నారు. అయితే ఇప్పటి దాక రూ.9,284 గా ఉన్న పెన్షన్ రూ.30,000-35,000కు పెరగనున్నట్లు DFS చెబుతోంది. వివిధ వర్గాల పెన్షనర్లకు 15, 20, 30 శాతం స్లాబ్ రేట్లలో చెల్లించాల్సిన ఫ్యామిలీ పెన్షన్‌ను ఎలాంటి ఫిక్స్డ్ క్యాప్ లేకుండా మెరుగుపరచాలని ఐబీఏ ప్రభుత్వానికి నివేదించింది. దీనికి కేంద్రం సరేనంది. ఇది ఇలా ఉండగా ఎంప్లొయెర్ కాంట్రిబ్యూషన్ ని పది నుండి పద్నాలుగు శాతానికి పెంచాలని ప్రభుత్వం బ్యాంకులను కోరింది.
ఇది ఇలా ఉంటే కేంద్ర నిర్ణయంతో కరోనా సమయంలో మరణించిన బ్యాంకు ఉద్యోగుల కుటుంబాలకు అందుతున్న పెన్షన్ 30 శాతం పెరిగింది. మరణించిన ఉద్యోగి చివరి జీతం ఆధారంగా దీనిని పెంచారు. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ.26,016 కోట్ల నష్టంతో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.31,817 కోట్ల లాభం వచ్చిందని ఆర్ధిక మంత్రి అన్నారు. ఐదేళ్ల నష్టాల తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకు లాభాలు పొందడం ఇదే మొదటిసారి.