భూగర్భ జలాల వాడకంపై కేంద్రం తాజాగా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. తాగునీటి, గృహ అవసరాల కోసం రోజూ 20 ఘనపు మీటర్లకు మించి భూగర్భజలాలు ఉపయోగించే అపార్ట్‌మెంట్లు, గ్రూప్ హౌసింగ్ సొసైటీలు అన్ని నిర్మాణాల వద్ద తప్పనిసరిగా డిజిటల్ వాటర్ ఫ్లో మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ భూగర్భజలాలపై ఆధారపడి ఈత కొలనులు ఏర్పాటు చేసుకొని ఉంటే వాటికి తప్పనిసరిగా నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీ) తీసుకోవాలని స్పష్టం చేసింది.
భూగర్భజలాల వినియోగ నియంత్రణకు మార్గదర్శకాలను నిర్దేశిస్తూ 2020 సెప్టెంబర్ 24న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవరించి తాజాగా కొత్త నోటిఫికేషను జారీ చేశారు. దీని ప్రకారం.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన మోడల్ బిల్డింగ్ బైలాస్ మేర వాననీటి సంరక్షణ ప్రణాళికను సమర్పించాలి. పరిశ్రమలన్నీ వచ్చే మూడేళ్లలో భూగర్భజలాల వినియోగాన్ని కనీసం 20% మేర తగ్గించుకోవాలి. అందుకు తగ్గట్టు కార్యాచరణ రూపొందించుకోవాలి. ట్యాంకర్ల ద్వారా భూగర్భజలాలను సరఫరా చేసేవారు తప్పనిసరిగా నిరభ్యంతర పత్రం తీసుకోవాలి.