తిరుమల విషయంలో మంత్రి కొడాలి నాని కామెంట్స్ రచ్చ రేపాయి. ఈ విషయం మీద ఇప్పటికే బీజేపీ, జనసేన, తెలుగుదేశంపార్టీలు విరుచుకు పడుతున్నాయి. తాజాగా కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా రేపు ఉదయం 11.30 గంటలకు చలో లోటస్ పాండ్ కు భజరంగ్ దళ్ పిలుపునిచ్చింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసం మరియు కార్యాలయన్ని ముట్టడించి అక్కడే ధర్నా కు భజరంగ్ దళ్ పిలుపునిచ్చింది.
వైసీపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను ఖండిస్తూ లోటస్ పాండ్ లోని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం మరియు కార్యాలయం వద్ద భారీ ధర్నా కార్యక్రమానికి తెలంగాణ భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్ పిలుపు నిచ్చారు. మంత్రి కొడాలి నానిని మంత్రి వర్గం నుండి వెంటనే తొలగించాలి. లేదంటే ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తామని వారు డిమాండ్ చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి హిందువులపై జరుగుతున్న దాడులపై నోరు విప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అలానే హిందువుల దేవతా విగ్రహాలపై, హిందువుల గుడులపై , హిందువుల మత విశ్వాసాల పై గత కొద్ది నెలలుగా ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న అన్ని దాడులపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని భజరంగ్ దళ్ పిలుపునిచ్చింది.