టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ రోడ్డెక్కనున్నారట. ఈ విషయాన్నిఆయనే స్వయంగా ప్రకటించారు. ఇ ప్పటి వరకు జగన్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు చేసిన ఆందోళనలు అలా ఉంటే.. ఇప్పుడు కొత్త పల్లవి పాడుతున్నారు. ఏడాదిన్నర కాలంగా ప్రదాన ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అనేక ఉద్యమాలకు పిలుపు ని చ్చింది. అనేక రూపాల్లో చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యమాలు కూడా చేశారు. దీక్షలు చేశారు. రాజధాని కోసం ఏకంగా జోలెపట్టారు. రాజధాని ఉద్యమాన్ని చెక్కుచెదరనివ్వకుండా చూసుకుంటున్నారు.
అయితే, ఇంత చేస్తున్నా.. ఎక్కడో టీడీపీగ్రాఫ్ పెరగడం లేదు. వాస్తవానికి మిగిలిన పార్టీలకు టీడీపీకి చాలా వ్యత్యాసం ఉంది. ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి? ప‌్రజల్లో పార్టీకి ఆదరణ ఎలా ఉందనే విషయాలను మిగిలిన పార్టీలు పెద్దగా పట్టించుకోవు. ఏదో ఎన్నికలకు ముందు ఒక సంవత్సరం పార్టీని లైన్లో పెట్టుకునేం దుకు రెడీ అవుతుంటాయి. కానీ, టీడీపీలో భిన్నమైన సంస్కృతి ఉంది. ప్రతి ఆరు మాసాలకు పార్టీ పరిస్థితిపై అంతర్గత నివేదికలు తెప్పించుకుంటారు. వాటిపై చర్చిస్తారు. ప్రతి విషయాన్ని కూలంకషంగా దృష్టి పెడతారు.
ఈ క్రమంలోనే అనేక మార్పులు చేస్తారు. ఇప్పుడు ఏడాదిన్నర కాలంలో అంటే .. అధికారం కోల్పోయిన తర్వాత.. పార్టీని పుంజుకునేలా చేసేందుకు చంద్రబాబు అనేక రూపాల్లో ఉద్యమాలు చేశారు. రాజధానిని ప్రతిష్టాత్మకంగా చేసుకున్నారు. అయితే, తాజాగా అందిన జిల్లాల రిపోర్టులను బట్టి.. పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని బాబుకు స్పష్టమైంది. దీంతో ఆయన ఇప్పుడు మళ్లీ ఉద్యమాలకు రెడీ అవుతున్నారు. అయితే, ఆ ఉద్యమాలు ఎలా ఉండాలి? ఏం చేస్తే.. పార్టీ పుంజుకుంటుందనే విషయంపై తర్జన భర్జన సాగుతున్న విషయం వెలుగుచూసింది.
వాస్తవానికి ఇప్పటికే అనేక రూపాల్లో ఉద్యమాలు చేశారు. ఇప్పుడు అంశాల వారీగా ఉద్యమాలు చేపట్టాలని బాబు నిర్ణయించుకున్నారని అంటున్నారు పార్టీ సీనియర్లు. దీనిలో భాగంగా త్వరలోనే పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగట్టేందుకు తమ్ముళ్లను సమాయత్తం చేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తంగా ఈ విషయం పక్కన పెడితే.. బాబు వైఖరి ప్రజలను ఇప్పటికీ ఆకర్షించలేక పోవడం చర్చనీయాంశంగా మారడం విశేషం.