మన శరీరంలోని ఎముకలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ డి ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే శరీర రోగ నిరోధక శక్తిని కూడా ఈ విటమిన్ పెంచుతుంది. విటమిన్ డి తక్కువగా ఉన్నవారు కోవిడ్ బారిన పడితే ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతుందని కూడా తాజాగా సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ విటమిన్ డి తగినంత అందేలా చూసుకోవాలి. నిత్యం సూర్యరశ్మిలో తగినంత సమయం పాటు ఉంటే విటమిన్ డి అందుతుందని మనకు తెలుసు. అలాగే పలు రకాల ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల కూడా విటమిన్ డిని పెంచుకోవచ్చు. ఆ ఆహారాలు ఏమిటంటే…
* కోడిగుడ్లలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అందులోని పచ్చసొనలో విటమిన్ డి ఉంటుంది. కనుక నిత్యం కోడిగుడ్లను తినాలి. వీటి వల్ల ఇతర విటమిన్లు, మినరల్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా లభిస్తాయి. ఇవి మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఒక కోడిగుడ్డు పచ్చని సొనలో దాదాపుగా 37 ఐయూ విటమిన్ డి ఉంటుంది. నిత్యం మనకు కావల్సిన విటమిన్ డిలో ఇది 5 శాతం. కనుక గుడ్లను నిత్యం కచ్చితంగా తీసుకోవాలి. దీంతో విటమిన్ డి లభిస్తుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* చేపల్లోనూ విటమిన్ డి ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా సాల్మన్, ట్యూనా అని పిలవబడే చేపల్లో ఇది మరీ ఎక్కువగా లభిస్తుంది. 100 గ్రాముల చేపలను తింటే సుమారుగా 526 ఐయూ విటమిన్ డి లభిస్తుంది. ఇది నిత్యం మనకు కావల్సిన విటమిన్ డిలో 66 శాతం. కనుక తరచూ చేపలను తింటే మంచిది.
* పుట్టగొడుగుల్లోనూ విటమిన్ డి ఎక్కువగానే ఉంటుంది. అలాగే సోయా మిల్క్, ఆవు పాలు, ఆరెంజ్ జ్యూస్, తృణ ధాన్యాలు, ఓట్ మీల్ తదితర ఆహారాలను నిత్యం తీసుకున్నా విటమిన్ డి మనకు లభిస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా కోవిడ్ నుంచి మనకు ఇమ్యూనిటీ లభిస్తుంది.