ఏపీలో విపక్ష తెలుగుదేశం పార్టీలో భారీ ఎత్తున ప్రక్షాళన ప్రారంభమైనట్టే కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు ఇతర పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఇప్పటికే ఉన్న కేడర్‌ను కాపాడుకునేందుకు… నాయకుల్లో మనోస్థైర్యం నింపి వారిని కాపాడుకునేందుకు చంద్రబాబు అనుబంధ సంఘాల నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు రెడీ అవుతున్నారు.
పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో పార్టీలో అనుబంధ సంఘాలను చంద్రబాబు ఎంత మాత్రం పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు అనుబంధ సంఘాల్లో మార్పులు, చేర్పులు చేయకపోయినా, వారిని పక్కన పెట్టినా మొదటికే మోసం వస్తుందని గ్రహించిన చంద్రబాబు ఇప్పుడు వాటిని పటిష్టం చేసే క్రమంలో కొందరిని పక్కన పెట్టేందుకు రెడీ అవుతున్నారు.
ఈ క్రమంలోనే పార్టీలో లేడీ లీడర్‌ను పక్కన పెట్టేందుకు రెడీ అవుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ప్రస్తుతం ఎమ్మెల్సీ పోతుల సునీత ఉన్నారు. ఆమె యాక్టివ్ గా లేకపోవడంతో ఆమె స్థానంలో మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను నియమించాలని దాదాపు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
వంగలపూడి అనిత 2014లో పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో ఆమెను పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేయించగా ఆమె ఓడిపోయారు. ఇక పోతుల సునీత 2014లో చీరాల నుంచి పోటీ చేయగా ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత ఆమెకు బాబు ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు తెలుగు మహిళా అధ్యక్షురాలి పదవి ఇచ్చారు.
అయితే ఆ పదవిలో ఆమె రాణించలేకపోయారన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమెను పక్కన పెట్టేసి యాక్టివ్‌గా ఉండే అనితకు ఈ పదవి ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే సునీతకు పెద్ద షాకే అనుకోవాలి. ఇక బీసీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ అర్జునుడు నియమించాలని భావిస్తున్నారు. వీటితో పాటు మిగిలిన అనుబంధ సంఘాల నాయకులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు.