బాబు మైండ్ గేమ్: పవన్ అలెర్ట్..అయినా పొత్తు ఫిక్స్?

-

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ల సమయం ఉంది..అయినా సరే ఇప్పుడే ఏదో ఎన్నికలు జరుగుతున్నట్లే ఏపీలో రాజకీయాలు జరుగుతున్నాయి. అసలు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య నువ్వా-నేనా అన్నట్లు వార్ నడుస్తోంది. అయితే అధికార వైసీపీని డామినేట్ చేయాలని చూస్తున్న టీడీపీ ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తుంది.

chandrababuఈ క్రమంలోనే టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం నడుస్తోంది. జనసేనని కలుపుకుంటేనే వైసీపీకి చెక్ పెట్టగలమని టీడీపీ భావిస్తుంది. అందుకే పొత్తు దిశగానే చంద్రబాబు ముందుకెళుతున్నారు. కానీ పొత్తు విషయంలో పవన్ అప్పుడే ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అదే విషయాన్ని చంద్రబాబు పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇక ఈ పొత్తు విషయంపై జనసేన నేతలు ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు స్పందిస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కొందరు మాట్లాడుతుంటే…పవన్‌ని సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే పొత్తు పెట్టుకోవడానికి రెడీ అని మరికొందరు మాట్లాడుతున్నారు.

ఈ క్రమంలో పొత్తు అంశంపై పవన్ స్పందించారు. ఇప్పటికే జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉందని, అలాగే పొత్తుల విషయంలో తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని చెప్పారు. ఈ వ్యవహారంలో అంతా ఒకటే మాట మీద ఉందామన్నారు. ఎవరు ఏం మాట్లాడినా.. మైండ్ గేమ్‌లు ఆడినా మనం మాత్రం పావులు కావద్దని, ముందు సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారిద్దామని చెప్పారు.

అయితే పూర్తి ప్రజాస్వామ్యబద్దంగా అందరికీ ఆమోదయోగ్యమైన ఆలోచనే ముందుకు తీసుకువెళ్తానని, అప్పటి వరకు ఎవరేం మాట్లాడినా సంయమనంతోనే ఉండాలని సూచించారు. అంటే పొత్తు విషయంలో చంద్రబాబు ముందుగానే ఒక రాయి వేశారు. దానికి జనసేన నేతలు తొందరపడి మాట్లాడేశారు. అందుకే మైండ్ గేమ్‌లో పడొద్దని పవన్ సూచించారు. అదే సమయంలో పవన్ మాటలు బట్టి చూస్తుంటే పొత్తుకు పరోక్షంగా రెడీగానే ఉన్నట్లు కనిపిస్తోంది. టీడీపీపై ఆయన ఎలాంటి విమర్శలు చేయడం లేదు… ఆ పైగా సమయం చూసి నిర్ణయం తీసుకుందామని అంటున్నారంటే..పొత్తుకు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లే కనిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news