ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఇటీవల చంద్రబాబు తరచూ పోలీసులపై విమర్శలు చేస్తున్నారు. సాధారణ విమర్శలే కాకుండా శ్రుతి మించుతున్నారు. మళ్లీ మేం అధికారంలోకి వస్తే మీ సంగతి చూస్తాం అన్న లెవల్లో వార్నింగ్ ఇస్తున్నారు. మేం అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో గుర్తు పెట్టుకుని మసలాలి అంటూ ఘాటుగా హెచ్చరిస్తున్నారు.
చంద్రబాబు కామెంట్లపై ఏపీ పోలీసు ఉద్యోగుల సంఘం మండిపడుతోంది. పోలీసుల జాతకాలు తనవద్ద ఉన్నాయంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికావని పోలీసు అధికారుల సంఘం కామెంట్ చేసింది. తెలుగు దేశానికి సహకరించని పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతామని.. మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటామంటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయటం తగదని పోలీసు అధికారుల సంఘం నేతలు స్పష్టం చేశారు.
విశాఖలో టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల పై చేస్తున్న వాఖ్యలు సరికాదని దీనిపై డీజీపీకి క్షమాపణలు చెప్పాలని పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది. గతంలో చాలా ఘటనలపైనా తాము స్పందించామని పోలీసులకు రాజకీయాలు ఆపాదించటం సరికాదని నేతలు వ్యాఖ్యానించారు. పోలీసు శాఖలో నిర్లిప్తత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపైనే ఉందని వారు వ్యాఖ్యానించారు.
తాము పోలీసు మాన్యువల్ ప్రకారమే విధులు నిర్వహిస్తున్నామని ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని సంఘం నేతలు తెలిపారు. డీజీపీ నుంచి దిగువ స్థాయి పోలీసు సిబ్బంది వరకూ ప్రతి ఒక్కరినీ రాజకీయ నాయకులు బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.