వారు ‘ కాపు ‘ కాయరని అర్థం అయ్యిందిగా ?

-

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న తప్పిదాలను తీరిగ్గా ఇప్పుడు గుర్తు చేసుకుంటూ బాధ పడుతున్నారు. తాను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని తప్పులు చేశాను అని, వాటికి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నానని, ఇకపై ఆ తప్పులు జరగకుండా చూసుకుంటాను అంటూ ఎక్కడలేని బాధను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు దగ్గర ఓదార్పు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో టిడిపి ఘోరాతి ఘోరంగా ఓటమి చెందడాన్ని బాబు ఇప్పుడు సమీక్షించుకుంటున్నారు. అసలు ఇంత దారుణమైన ఫలితాలు రావడానికి సామాజికవర్గాల సమీకరణ లెక్కలు పక్కాగా వేయలేకపోవడం, అందులో విఫలం అవ్వడమే కారణం అనే అభిప్రాయం టీడీపీలో రావడమే అన్న విషయం ఇప్పుడు చంద్రబాబుకు బాగా అర్థమైంది.

ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ హామీని పూర్తిగా మరిచిపోవడంతో అసలు వివాదం మొదలైంది. కాపులకు రిజర్వేషన్లు ఇస్తాను అంటూ చంద్రబాబు మాదిరిగా తాను మోసం చేయలేనని జగన్ సూటిగా చెప్పడం టీడీపీకి కల్సి వస్తుందని అంచనా వేసినా వర్కవుట్ కాలేదు. పైగా టీడీపీకి వ్యతిరేకంగా కాపు సామాజిక వర్గం వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడం వంటి పరిణామాలతో కంగారు పడ్డ చంద్రబాబు పూర్తిగా కాపులు తనకు దూరం అవుతున్నారనే అభిప్రాయంతో వారిని దగ్గర చేసుకునేందుకు కాపు కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున వారికి లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చేశారు.

అలాగే వారికి అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తూ వస్తుండడంతో, బీసీ సామాజిక వర్గాలవారు టిడిపికి వ్యతిరేకంగా మారాయి. ఇది గుర్తించే సరికి 2019 ఎన్నికలు రావడం, టిడిపి బీసీ సామాజిక వర్గానికి దూరం అయ్యింది అనే విషయం అందరికీ అర్ధం అయ్యింది. పోనీ కాపులు టీడీపీకి మద్దతు పలికే అవకాశం ఉందా అంటే అదీ లేదు. తాను కాపు రిజర్వేషన్ ఇవ్వలేని జగన్ సూటిగా చెప్పేసినా, కాపు సామాజిక వర్గం కొంత వైసిపికి అనుకూలంగా వ్యవహరించింది. ఇక మరో వర్గం జనసేన వైపు మొగ్గు చూపడంతో, టిడిపికి అటు బిసి, ఇటు కాపు సామాజిక వర్గాల మద్దతు పూర్తిగా దూరమై ఫలితాలు చేదుగా వచ్చాయి.

తాము ఎన్ని చేసినా, ఎన్ని హామీలు ఇచ్చినా, కాపులు ఇక టీడీపీకి దగ్గరయ్యే ఛాన్సే లేదని, కాపులకు ప్రాధాన్యత పెంచడం వల్ల, బీసీ సామాజికవర్గాలను దూరం చేసుకుని మరో సారి తప్పు చేయకూడదనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారు. అందుకే బీసీలను మళ్లీ తన దారిలోకి తెచ్చుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరో పక్క చూస్తే బీజేపీ-జనసేన రెండు పార్టీలు కాపులను టార్గెట్ గా చేసుకుని, ఆ సామాజిక వర్గాన్ని పూర్తిగా తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో బీసీలు ఆ రెండు పార్టీల వైపు చూసే అవకాశం లేదనే అభిప్రాయంతో పూర్తిగా బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తూ, కాపు జపాన్ని పూర్తిగా పక్కన పెట్టాలని కీలక నిర్ణయం తీసుకున్నారట. వారికి ఎన్ని రకాలుగా ప్రయోజనాలు చేకూర్చినా వారు టీడీపీకి మద్దతు ఇచ్చే అవకాశమే లేదనే విషయాన్ని చంద్రబాబు కాస్త ఆలస్యంగా అయినా గ్రహించారు.

-Surya

Read more RELATED
Recommended to you

Exit mobile version