రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా ఫోన్ ట్యాపింగ్ విషయం కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని జగన్ సర్కారుకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇస్తోందనే వాదన కొన్నాళ్లుగా అధికార పార్టీలో వినిపిస్తోంది. దీనిపై హైకోర్టు అన్యాపదేశంగా వివరణ కూడా ఇచ్చింది. అయితే.. ఇటీవల అనూహ్యంగా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు.. ట్యాపింగుకు గురవుతున్నాయంటూ.. ఓ వార్త వచ్చింది. దీనిపై ప్రభుత్వం ఇంకా వివరణ ఇవ్వకుండానే.. ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ అని చెప్పుకొనే చంద్రబాబు.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేఖ రాశారు. వాస్తవానికి కేంద్రమే ఇప్పుడు ఫేస్ బుక్ ఆరోపణలతో తీవ్ర ఇబ్బందుల్లో నలిగిపోతోంది. ఈ సమయంలో ఏ సమస్యలనూ పట్టించుకునే తీరిక లేదు.
కానీ, చంద్రబాబు మాత్రం ట్యాపింగ్ విషయాన్ని లేఖ రూపంలో తీసుకురావడం ద్వారా జాతీయ స్థాయిలో తాను లబ్ధి పొందడంతోపాటు.. రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని అపకీర్తి పాల్జేయాలనే ఉద్దేశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు తన ఫోన్‌నే తెలంగాణ సర్కారు ట్యాప్ చేసిందని, అరిచి గగ్గోలు పెట్టిన చంద్రబాబు తన సొంత అధికారులను అప్పట్లో రంగంలోకి దింపి విచారణ పేరుతో తెలంగాణకు పంపి హడావుడి చేశారు.
అయితే అప్పుడు బాబు కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. దీనికి కారణం ఇప్పుడు ఆయన చెప్పాల్సి ఉంది. తాజాగా ఆయన రాసిన లేఖలో రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని పేర్కొన్నారు. వాస్తవానికి ఇది అర్దం లేదని ఆరోపణ. జగన్ ప్రభుత్వానికి అత్తెసరు.. మెజారిటీ ఉండి, నిన్న మొన్నటి రాజస్థాన్ సర్కారు మాదిరిగా పరిస్థితి ఏర్పడే అవకాశం ఉండి.. ప్రతిపక్షం అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు చేస్తోందని భావిస్తే.. చంద్రబాబు వాదనను ఎవరైనా పరిగణనలోకి తీసుకుని ఉండేవారు. కానీ, ఏపీలో అలాంటి పరిస్థితి లేదు.
ఇక, అదే సమయంలో రాష్ట్రంలో ఏది జరిగినా, కోర్టులు ఉన్నాయని, వాటిలో తేల్చుకుంటామని చెప్పే చంద్రబాబు ఈ విషయంలో వాటిని సైతం పక్కన పెట్టి కేంద్రానికి లేఖ రాయడం వెనుక రాజకీయ ఎత్తుగడే తప్ప మరేమీ లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ లేఖతో ఆయన ప్రయోజనం పొందాలని అనుకున్నా.. అలాంటిది ఏమీలేదనే విశ్లేషకుల అభిప్రాయం. మొత్తానికి మరో సెల్ఫ్‌గోల్‌తో బాబు నవ్వుల పాలయ్యారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదాపైనా.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనా ఆయన లేఖలు సంధించి ఉంటే.. పేరువచ్చేదని చెబుతున్నారు.