తెలంగాణలో రాజకీయం బాగా వేడెక్కింది. ఆర్టీసీ సమ్మె ఉధృతంగా నడుస్తోంది. దీనికి తోడు ఆర్టీసీ కార్మికులకు ఇతర వర్గాలు కూడా మద్దతిస్తున్నాయి. సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. సమ్మె మొదలై 11 రోజులు గడుస్తున్నా కార్మికులు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. మీ ఉద్యోగాలు పీకేశాం అన్నా బెదరడం లేదు.
అదే సమయంలో సమ్మెతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే చంద్రబాబుకు మాత్రం ఈ సమ్మె అంతగా పట్టినట్టు లేదు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆయన పెద్దగా చలించడం లేదు. కాకపోతే మరీ బావుండదనుకున్నారో ఏమో.. ట్వీట్ ద్వారా స్పందించారు.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం కలిచివేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్వీట్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావన్నారు. జీవితం ఎంతో విలువైనదని, బతికిసాధించాలే తప్ప బలవన్మరణం పరిష్కారం కాదని సూచించారు.
ఎవరూ, ఎక్కడా, ఆత్మహత్యా యత్నాలకు పాల్పడవద్దని చంద్రబాబు కార్మికులను కోరారు. కార్మికులంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. బాగానే ఉంది. కానీ ఇదే ప్రయత్నం ఆన తెలంగాణకు వచ్చి చేస్తే బావుండేది. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను చంద్రబాబు పరామర్శిస్తే.. ఇక్కడి తెలుగుదేశం పార్టీకి నైతిక బలం వచ్చేది.
కానీ ఎందుకనో చంద్రబాబు ఆ ప్రయత్నం చేయడంలేదు. తాను ఆంధ్ర ప్రదేశ్ కే పరిమితం అని ఆయన ఫిక్స్ అయ్యారో.. లేక ఇప్పుడు ఆ కేసీఆర్ తో పెట్టుకోడవం ఎందుకు.. లేని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకు అనుకుంటున్నారో ఏమో.. ఆ ప్రయత్నం మాత్రం చేయడం లేదు. అసలే నోటుకు ఓటు కేసు ఇంకా బతికే ఉంది కదా.. మరి దాని ప్రభావమో ఏమో..?