ఏపీ మజీ సీఎం చంద్రబాబు మళ్లీ రెచ్చిపోయారు. సెల్ఫ్‌గోల్ కొట్టుకున్నారు. తాను తప్ప.. ఈ దేశంలోని రాజకీయ నాయకులు అందరూ కూడా జూనియర్లేనని ఒకానొక సందర్భంలో వెల్లడించి.. అందరితోనూ చీవాట్లు తిన్న చంద్రబాబు.. తర్వాత కాలంలోనూ తనలాంటి సీఎం ఎవరూ లేరని చెప్పుకొంటూ తిరిగారు. ఇక, దేశం మొత్తం అంతెందుకు ప్రపంచం కూడా ఏపీవైపు చూసేలా చేస్తానని చెప్పుకొచ్చారు. సరే. అధికారంలో ఉండగా.. తాను చేసింది శాసనం, తాను మాట్లాడింది వేదం.. అన్న విధంగా సాగిందని అనుకోవచ్చు.
అయితే, ఇప్పుడు తాను ప్రతిపక్షంలో ఉన్నానని, ప్రజలు తనను ప్రతిపక్షానికి పరిమితం చేశారని అనుకోవ డంలోనూ చంద్రబాబు వెనుకబడిపోయారని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం కూడా ఆయనే సీఎం అనే రేంజ్‌లో వ్యాఖ్యలు వ్యవహారం చేస్తున్నారు. ఇటీవల ఆయన బెదిరింపు ధోరణితో పోలీసులపై విరుచుకుపడ్డారు. తాజాగా ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి పనినీ.. ఆ… ఇదేముంది .. మా హయాంలో ప్రారంభించిన కార్యక్రమమే అంటూ.. సెల్ఫ్‌గోల్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగాలను సీరియస్‌గా తీసుకున్న వైసీపీ ప్రభుత్వం నాలుగు లక్షల మందిని నియమించింది.
దీనికి సంబంధించి అటు గ్రామాలు, పట్టణాల్లోనూ మంచి ఊపు వచ్చింది. జగన్‌కు గ్రామీణులు కూడా హారతులు పడుతున్నారు. అయితే, వైసీపీకి ఈ పరిణామం ఎక్కడ కలిసి వస్తుందోనని భావించిన చంద్రబాబు.. వెంటనే రంగంలోకి దిగిపోయారు. గ్రామ సచివాలయ వ్యవస్థపై మాట్లాడుతూ.. ఇదంతా ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదని చెప్పారు. అంతేకాదు, 2003లోనే తాను ప్రవేశ పెట్టానని, అయితే, తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో తాను దానిని ముందుకు తీసుకువెళ్లలేక పోయానని చంద్రబాబు సెలవిచ్చారు.
అంతేతప్ప.. మనం గత ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నా.. పట్టించుకోని ఓ సుందర స్వప్నాన్ని, గ్రామస్వరాజ్యాన్ని యువకుడైన జగన్ చేసి చూస్తున్నాడనే ఆనందం కానీ, ఓ పౌరుడిగా సంతోషం కానీ ఆయనలో లేక పోవడాన్ని విమర్శకులు దెప్పిపొడుస్తుండడం గమనార్హం.