టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలిసిన నాయకుడు. గతంలోను, ఇప్పుడు ఆయన తనదైన శైలిలో విశ్వరూపం చూపించారు. ఇప్పటి వరకు పార్టీ నడిచిన తీరు, నడిపించిన తీరు ఒకవిధం. అయితే, రాబోయే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వేస్తున్న అడుగులు మరో కీలక ఎత్తు! భవిష్యత్తు ఎన్నికలు అంత ఆషామాషీ కాదు. ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో… కళ్లకు కడుతున్న క్షణాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో పార్టీని పునరుజ్జీవింపచేయడం, పార్టీని పరుగులు పెట్టించడం అంటే.. వ్యూహాత్మకంగా సాగాల్సిన అవసరం ఉంది.
బహుశ ఈ కీలక సూత్రాన్ని గుర్తించారో.. ఏమో.. చంద్రబాబు తాజాగా నియమించిన పార్లమెంటరీ జిల్లాల కమిటీల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, అదేసమయంలో తన సామాజిక వర్గానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముగ్గురు మహిళలకు కూడా చోటు కల్పించారు. ఎక్కువగా యువ నాయకులకు అవకాశం ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు చేసిన ప్రయోగం.. విధేయులకు వీరతాళ్లు వేయడమే. పార్టీ కోసం కష్టించినవారికి, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒడ్డి పార్టీకోసం శ్రమించిన వారిని గుర్తించడమే. వారికి పదవులు కట్టబెట్టడమే.
శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కూడా పార్టీకి జవసత్వాలు ఇచ్చేలా చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీలో కొన్నిదశాబ్దాలుగా ఉన్నవారికి.. ఇటీవలే పార్టీలోకి వచ్చిన వారికి కూడా ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. అదేసమయంలో వ్యూహాత్మకంగా పార్టీని నడిపిస్తారనే వారిని ఎక్కడా వదిలిపెట్టకుండా జాగ్రత్త తీసుకున్నారు. అత్యంత కీలకమైన రాజంపేట, కడప నియోజకవర్గాల విషయంలోనూ బలమైన నాయకులకు సారథ్యం అప్పగించారు.
ఇక, సామాజిక వర్గాలను ప్రభావితం చేయగల నాయకులకు కూడా పెద్దపీట వేశారు. అదేసమయంలో గత ఎన్నికల్లో జగన్ సునామీని తట్టుకుని నిలబడి, పార్టీ కోసం కృషి చేసి గెలిచిన ఎమ్మెల్యేలకూ ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తంగా ఈ కూర్పు.. చంద్రబాబు నేర్పునకు నిదర్శనమనే వ్యాఖ్యలు వినిపిస్తుండడంతోపాటు.. తమ్ముళ్ల మనసు గెలిచారనే ప్రశంసలు సైతం చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయనడంలో సందేహం లేదు.
-Vuyyuru Subhash