విజయవాడ ప్రజల మీద చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన ఈ కామెంట్స్ చేశారు. గుంటూరు-విజయవాడ లను కలుపుతూ అమరావతి రాజధాని నిర్మాణం చేయాలని భావించామని అన్నారు. అమరావతి కోసం ఎవరైనా పోరాడుతున్నారా..? మీరు ఇంట్లో పడుకుంటే నేను పోరాడాలా..? నాకు సంఘీభావం తెలిపి చేతులు దులుపుకోండి, అమరావతి విషయంలో బెజవాడలో ఇంటికొకరు ఎందుకు రావడం లేదు…? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లి పాచి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ.. అమరావతి కోసం పోరాడడానికి సిద్దంగా లేరని అన్నారు.
రోషం, పట్టుదల ప్రజల్లో ఎక్కడుంది ? పట్టిసీమ నాకోసం తెచ్చానా..?నీళ్లు తాగే వాళ్లకి అర్ధం కాదా..? అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. ఇవాళ రెండు వేలిస్తే ఓట్లేయండి.. ఆ తర్వాత ఊడిగం చేయాల్సి వస్తుందని అన్నారు. నాయకులే అన్ని చోట్లా ముందుండాలంటే కష్టాలొస్తాయని అభ్యర్ధులే ముందుండాలని అన్నారు. ఇక కొబ్బరి చిప్పలు అమ్ముకునే మంత్రి ఉన్నారన్న బాబు, దుర్గమ్మ సన్నిధిలో అవినీతి జరిగితే ఎందుకు రోషం రావడం లేదని అన్నారు. దుర్గమ్మ సన్నిధిలో అవినీతి కంపు కొడుతోంటే.. ప్రజలు ఆనందంగా పడుకుంటున్నారని అన్నారు. వెండి సింహాలు ఏమయ్యాయి..? నా మీద అభిమానం అక్కర్లేదు.. అమ్మవారి మీద కూడా అభిమానం లేదా..? అమ్మవారిని కాపాడుకోవాల్సిన అవసరం లేదా..? అని ఆయన ప్రశ్నించారు.