తోక జాడించిన అధికారులకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్న మంత్రి నాని

-

మంత్రి గారు ఆదేశించారంటే ఆ శాఖ పరిధిలోని ఏ అధికారయినా జీ హుజూరు అనాల్సిందే..మంత్రి గారు ఆదేశించిన లైట్ తీసుకుటే మాత్రం ఆ అధికారికి ట్రాన్సఫర్లో డిమోషన్లో ఉంటాయి. కానీ తోక జాడించిన అధికారులకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారట ఏపీ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని. ఆదేశాలు పాటించని అధికారులకు చుక్కలు చూపించి అంతే స్పీడుగా పనిష్మెంట్ ఇస్తున్నారట..ఇప్పుడిదే అంశం సచివాలయంలో హాట్ టాపిక్ గా మారింది.

ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని అందరి మంత్రులకు భిన్నంగా కాస్త డిఫరెంట్ వర్కింగ్ స్టైల్ మెంటెయిన్ చేస్తారు. నాని ప్రత్యేకించి రవాణా శాఖ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటున్నారట. రవాణా శాఖ నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగిన విభాగం. ఈ శాఖలోని ఉద్యోగులు శాఖాపరంగా ఏమైనా తప్పు చేస్తే.. అవి తన దృష్టికి వస్తే వెంటనే ఫోకస్‌ పెడుతున్నారట. ఎవరైనా అధికారులు తోక జాడిస్తే కత్తిరించేందుకు కూడా వెనకాడటం లేదట. అయితే ఈ సందర్భంగా మంత్రి తీసుకుంటున్న చర్యలు.. అనుసరిస్తున్న వైఖరే ఉద్యోగవర్గాల్లో చర్చగా మారుతోంది.

ఈ మధ్య విశాఖకు చెందిన కొంతమంది వాహన యజమానులు వచ్చి మంత్రి పేర్ని నానిని కలిసి వెళ్లారట. గంటసేపు జరిగిన ఈ భేటీలో తమకు ఎదురవుతోన్న ఇబ్బందులను ఏకరవుపెట్టారట ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్స్‌ ఓనర్స్‌. విశాఖలోని రవాణశాఖ ఉన్నతాధికారి తమను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశారట. అయితే ఈ ఫిర్యాదు పై స్పందించి సదరు అధికారిని అమరావతిలోని తన పేషీకి వచ్చి కలవాలని ఆదేశించారట మంత్రి. దీంతో అలర్ట్‌ అయిన సదరు అధికారి.. మంత్రి తన్నెందుకు సడెన్‌గా పిలుస్తున్నారో అర్థంకాక మంత్రిని కలిసిన వాహన యజమానులకు ఫోన్లు చేసి.. ఎందుకెళ్లారని తనస్థాయిలో బెదిరించారట. మర్నాడే సదరు యజమానులకు చెందిన వాహనాలు ఏ రూట్లో వెళ్తున్నాయో చూసి భారీ ఎత్తున చలాన్లు రాశారట. లబోదిబోమంటూ ఆ యజమానులు మళ్లీ మంత్రిని ఆశ్రయించారట.

సమస్యను తీవ్రంగా పరిగణించిన మంత్రి పేర్ని నాని.. ఆ అధికారిని అమరావతికి రప్పించి ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ కార్యాలయంలోనే దాదాపు నెలరోజులపాటు అట్టిపెట్టేశారట. ప్రతిరోజూ సదరు అధికారి ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ కార్యాలయానికి రావడం.. కూర్చోవడం.. మధ్యాహ్నం భోజనం చేయడం.. సాయంత్రం కాగానే తిరిగి వెళ్లడం. సుమారు నెల రోజులుగా ఆ అధికారికి ఈ పని తప్ప మరే ఇతర పని లేదట. దీంతో మంత్రి రమ్మన్న రోజునే వచ్చి.. తన వివరణేదో ఇచ్చేసుకుంటే పోయేది కదా? గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నానని ఆ అధికారి ఇప్పుడు లబోదిబోమంటున్నారట.

ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌పై రవాణశాఖలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎవరికి తోచిన విధంగా వారు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. ఈ సందర్భంగా మరో ప్రచారం కూడా జరుగుతోంది. మాట వినని అధికారులకు స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తే తప్ప దారిలోకి రారనే థియరీని మంత్రి పేర్ని నాని బాగానే వంటబట్టించుకున్నారని చెవులు కొరుక్కుంటున్నారు ఉద్యోగులు. ఇదే కాదు.. తన మాట వినని వారి విషయంలో మంత్రి ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారని టాక్‌.

Read more RELATED
Recommended to you

Latest news