విజయవాడ పార్లమెంటు సమీక్షలో టిడిపి నేతలతో చంద్ర బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్ష జరిపిన బాబు మూడు ముక్కలాటగా పరిపాలనను జగన్మోహన్ రెడ్డి మార్చారని అన్నారు. పరిపాలనలో అనుభవం లేదని, క్రైసిస్ మేనేజిమెంట్ తెలియదుక్ గవర్నెన్స్ చేతగాదు, అడ్మినిస్ట్రేషన్ గుండుసున్నా అలా టాప్ 3లో ఉన్న రాష్ట్రాన్ని 20వ స్థానంలోకి దిగజార్చారని అన్నారు. తప్పుల మీద తప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నారన్న ఆయన 150ఏళ్ల కృష్ణా డెల్టా చరిత్రలో జూన్ లో నీళ్లివ్వడం టిడిపి ప్రభుత్వ ఘనతేనని అన్నారు.
అప్పుడు పట్టిసీమ దండగ అన్నారు, ఇప్పుడదే దిక్కు అయ్యిందని అన్నారు. ‘‘సెంటు పట్టా కాదు, స్కామ్ పట్టా గా’’ ఇళ్ల స్థలాల పథకాన్ని చేశారన్న ఆయన ఇంత పనికిమాలిన ప్రభుత్వాన్ని చరిత్రలో చూడలేదని అన్నారు. తన మూర్ఖత్వంతో, వితండ వాదనతో రాష్ట్రానికి జగన్ తీవ్ర నష్టం చేస్తున్నారని, ఇసుక, మద్యం, భూములు,గనులు, ప్రతిదానిలో వైసిపి కుంభకోణాలేనని అన్నారు. కొండలు కొట్టేస్తున్నారు,అడవులు నరికేస్తున్నారు,మట్టి,ఇసుక మింగేస్తున్నారని బాబు పేర్కొన్నారు. ఇంత దుర్మార్గ పరిపాలన రాష్ట్రంలో గతంలో చూడలేదన్న ఆతన ఇలాంటి అరాచక శక్తిని ముందెప్పుడూ చూడలేదని అన్నారు. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ ఇన్ని అఘాయిత్యాలు జరగలేదని హత్యలు చేయడంలో, ఆత్మహత్యలుగా చిత్రించడంలో వైసిపి నాయకులు సిద్దహస్తులని అన్నారు.