వరద బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉండాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. సహాయక ఉపశమన చర్యలలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది అని ఆయన అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వర్షపు నీటితో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు. పంట నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు అని ఆవేదన వ్యక్తం చేసారు. చేనేత కారులు, మత్య్సకారులు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర చేతివృత్తుల వారు ఉపాధి కోల్పోయారన్నారు.
ఈ పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉండాలని అన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి బాధిత కుటుంబాలకు పూర్తి సహకారం అందించాలి. వారిలో మనోధైర్యం పెంపొందించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. గత రెండేళ్లుగా వరుస వరద విపత్తులు, భారీ వర్షాలతో తీవ్ర నష్టం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధితులకు సహకారం లేదని మండిపడ్డారు.