నేటి అర్థరాత్రి సరిగ్గా 2.51 గంటలకు (తెల్లవారితే సోమవారం) చంద్రయాన్-2ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. చంద్రయాన్-2 గనక విజయవంతమైతే సాఫ్ట్‌ల్యాండ్ స్పేస్ మిషన్లలో ఆ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ నిలుస్తుంది.
చంద్రునిపై ఉండే వాతావరణం, ఇతర విషయాలను తెలుసుకునేందుకు గతంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-1 కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విదితమే. కాగా దానికి కొనసాగింపుగా ఇప్పుడు చంద్రయాన్-2 ను ఆ సంస్థ ఇవాళ లాంచ్ చేయనుంది. నేటి అర్థరాత్రి సరిగ్గా 2.51 గంటలకు (తెల్లవారితే సోమవారం) చంద్రయాన్-2ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. అయితే చంద్రయాన్-2 విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
చంద్రయాన్-2 కార్యక్రమానికి మొత్తం రూ.1వేయి కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇందులో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన జీఎస్‌ఎల్‌వీ ఎంకే 3 రాకెట్ 3.8 టన్నుల బరువు ఉండే చంద్రయాన్-2 శాటిలైట్‌ను అంతరిక్షంలోకి మోసుకెళ్తుంది. ఈ రాకెట్ బరువు 640 టన్నులు కాగా ఇది 15 అంతస్థుల భవనమంత ఎత్తు ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు భారత్ ప్రయోగించిన అత్యంత భారీ రాకెట్లలో ఇది 3వది కావడం విశేషం.
కాగా ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో చంద్రయాన్-2ను ప్రయోగించనుంది. ఇందుకు గాను ఇప్పటికే కౌంట్‌డౌన్‌ను కూడా ప్రారంభించారు. ఇక జీఎస్‌ఎల్‌వీ ఎంకే 3 రాకెట్ చంద్రయాన్-2ను రెండు నెలల కాలంలో 3.84 లక్షల కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లి చంద్రుని కక్ష్యలో ప్రవేశపెడుతుంది. అనంతరం చంద్రయాన్-2 అక్కడే పరిభ్రమిస్తూ ఉంటుంది. దాన్నుంచి మళ్లీ విక్రమ్ అనే 1.4 టన్నుల బరువున్న ల్యాండర్ 27 కిలోగ్రాముల బరువుండే ప్రగ్యాన్ అనే రోవర్‌ను చంద్రుని దక్షిణ ధృవం వద్ద సురక్షితంగా దింపుతుంది. ఈ క్రమంలో రోవర్ తన చక్రాల సహాయంతో చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ అక్కడ ఉండే మట్టి, రాళ్లు, ఇతర పదార్థాలకు చెందిన నమూనాలను సేకరించి అక్కడే రసాయన విశ్లేషణ చేస్తుంది. అనంతరం ఆ వివరాలను రోవర్ చంద్రయాన్-2కు పంపుతుంది. అక్కడి నుంచి ఆ వివరాలు భూమిపై ఉండే సైంటిస్టులకు అందుతాయి. కాగా ఈ కార్యక్రమం మొత్తం ఏడాదిలో పూర్తవుతుంది.
అయితే చంద్రయాన్-2 గనక విజయవంతమైతే సాఫ్ట్‌ల్యాండ్ స్పేస్ మిషన్లలో ఆ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ నిలుస్తుంది. అంతకు ముందు ఇలాంటి ప్రయోగాలను అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే విజయవంతంగా పూర్తి చేశాయి. ఈ ఏడాది ఆరంభంలో ఇజ్రాయిల్ కూడా దాదాపుగా ఇలాంటి ప్రయోగమే చేసింది కానీ అది విఫలమైంది. ఇక ఈ మిషన్ సక్సెస్ అయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కూడా ఓ ఘనత సాధించినట్లే. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమానికి అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ నాసా భారీగా ఖర్చు పెట్టింది. కానీ భారత్ మాత్రం అంతకన్నా 20 రెట్లు తక్కువ ఖర్చుతోనే ఈ ప్రయోగం చేస్తుండడం విశేషం. కాగా ఈ ప్రయోగానికి వాడిన చంద్రయాన్-2 ఉపగ్రహం, ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రగ్యాన్‌లు అన్నింటినీ పూర్తిగా భారత సాంకేతిక పరిజ్ఞానంతోనే తయారు చేయడం మరో విశేషం.. ఇక నేటి అర్థరాత్రి లాంచ్ కానున్న చంద్రయాన్-2కు మనం సిద్ధమవుదామా..!