గతంలో టీడీపీ చేసిందే ఇప్పుడు వైసీపీ చేస్తుందా…?

-

తూర్పు పడమరలు కలవవు,కలపాలని ప్రయత్నించిన అది సాధ్యం కాదు…అలాంటి ప్రయత్నమే గతంలో టీడీపీ చేసింది ఇప్పుడు మళ్లీ వైసీపీ వంతు. ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కండువా లేకుండా ఆహ్వానిస్తున్నారు గానీ.. వాళ్లు చేరాక లోకల్‌ లీడర్స్‌తో ఇమడలేకపోతున్నారు. ఏదో అధిష్ఠానం కోసం నవ్వులు పులుముకుంటున్నా.. ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు.

ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా అధికార పార్టీకి జై కొట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరామ్‌. ఈ ఎమ్మెల్యేల రాక బాగానే ఉన్నా.. వీరి చేతిలో ఎన్నికల్లో ఓడిన వైసీపీ నాయకులు ఇప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితి. గన్నవరంలో వంశీతో ఢీ అంటే అంటున్నారు యార్లగడ్డ వెంకట్రావు. ఆ మధ్య పునాదిపాడులో సీఎం జగన్‌ చొరవ తీసుకుని వంశీ, యార్లగడ్డ చేతులు కలిపారు. దీంతో సమస్యకు చెక్‌ పడిందని అనుకున్నా.. యార్లగడ్డకు ఇది రుచించలేదని సమాచారం.

ఇక చీరాలలో ఆమంచి కృష్ణమోహన్‌, కరణం బలరామ్‌ వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయ్‌. సందర్భం వస్తే పరోక్ష వ్యాఖ్యలతో నాయకులే వేడి పుట్టిస్తున్నారు. నెలక్రితం జరిగిన వైఎస్‌ఆర్‌ వర్థంతి కార్యక్రమంలో రెండు వర్గాలు బాహా బాహీకి దిగడం పార్టీ వర్గాలను కలవర పర్చింది. రెండు వర్గాలు కలిసి పనిచేసే పరిస్థితి లేదు. ఆ మధ్య చీరాలను కరణం బలరామ్‌కు అప్పగించి.. ఆమంచిని చీరాల పక్కనే ఉన్న పర్చూరుకు పంపుతారని వైసీపీలో ప్రచారం జరిగింది. దానికి ఆమంచి ఒప్పుకోలేదని.. చీరాలలో సొంత కేడర్‌ ఉండటంతో కదలడానికి ఇష్టపడటం లేదని సమాచారం.

టీడీపీని వీడి వైసీపీ పంచన చేరిన మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్‌కుమార్‌ నియోజకవర్గాల్లో ఈ స్థాయిలో వ్యతిరేకత, వర్గ పోరు లేదు. కానీ.. గన్నవరం, చీరాల నియోజకవర్గాలు మాత్రం నిత్యం కుతకుతలాడుతూనే ఉన్నాయి. ఎవరెప్పుడు.. ఏ విధంగా బరస్ట్‌ అవుతారో తెలియదు. అది ఎటు నుంచి ఎటు దారితీస్తుందో అర్థం కాదు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్టు నేతల వైఖరి ఉంది. వైసీపీకి జై కొట్టినప్పటి నుంచీ ఈ ఇద్దరు నేతలు వైసీపీలోని తన ప్రత్యర్థులను ఢీకొట్టడమే సరిపోతోంది. తన ఆధిపత్యాన్ని ఎప్పటికప్పుడు చాటుకోవాల్సిన దుస్థితి ఉందని అంటున్నారు. మరి.. పార్టీ పెద్దలు ఈ గొడవలకు మంత్రమే వేస్తారో.. కాయకల్ప చికిత్సే చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news