విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి మహేష్ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతనిని కాల్చి చంపి హత్య చేయడానికి ముందు మహేష్ ను గస్తీ పోలీసులు హెచ్చరించినట్టు తెలుస్తోంది. బైపాస్ రోడ్డులో కారు నిలిపి స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్న మహేష్ వద్దకు పెట్రోలింగ్ పోలీసులు వెళ్లారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించ కూడదని వెంటనే అక్కడి నుంచి కారు తీసి వెళ్ళిపోవాలని వాళ్లను హెచ్చరించారు. అయితే తాను సీపీ కార్యాలయ ఉద్యోగినంటూ మహేష్ తన ఐడీ కార్డును చూపించాడు.
అయితే ఎవరైనా సరై అక్కడ ఉండడానికి వీల్లేదని అలా వెళ్ళని పక్షంలో తాము వెళ్లి రక్షక్ వాహనం పంపిస్తామని చెప్పి వెళ్లిపోయారు పెట్రోలింగ్ పోలీసులు. అయితే గస్తీ పోలీసులు వెళ్లిపోయిన కొద్ది సేపటికే మహేష్ మీద కాల్పులు జరిపి దుండగులు హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు. ఈ హత్యకు అసలు కారణాలు ఏమిటి..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం పోలీసుల అదుపులో మహేష్ స్నేహితుడు, పెళ్లి చేసుకోవాలని అనుకున్న యువతి తమ్ముడు ఉన్నారు. కాల్పులు జరిగిన సమయంలో సెల్ ఫోన్ సంభాషణ డేటాను సేకరిస్తున్నారు పోలీసులు.