సరిహద్దుల్లో గత రెండు నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తత కొంత తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పు గాల్వన్ లోయ వద్ద ఉద్రిక్తతలు నెలకొనేలా చైనా బలగాలు దుందుడుకు చర్యలకు పాల్పడి 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నాయి. ఆ తర్వాత డ్రాగన్ చర్యలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. కాగా, చైనా సైన్యం గాల్వన్ లోయ వద్ద నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లాయని భారత ప్రభుత్వ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
అలాగే ఘర్షణ నెలకొన్న ప్రాంతం నుంచి భారత్ – చైనా తాత్కాలిక నిర్మాణాలను తొలగించినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయితే, చైనా పారదర్శకంగా వ్యవహరిస్తుందా? మళ్లీ సైన్యాన్ని ముందుకు పంపుతుందా? అన్న విషయంపై తాము దృష్టి పెడతామని భారత అధికారులు అన్నారు. జూన్ 30న ఇరు దేశాల సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల్లో బలగాల ఉపసంహరణపై ఓ నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే.