మొన్నటివరకూ జనాభాలో ముందున్న చైనాలో జనాభా రేటు ఘోరంగా పడిపోయింది. కరోనా వల్ల ఎంతో మంది చనిపోయారు. తాజాగా జననాలను పెంచేందుకు చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెళ్లి సమయంలో వధువుకు సొమ్ము ముట్టజెప్పే సంప్రదాయాన్ని కట్టడి చేయడం మొదలుపెట్టింది. చైనాలో వరుడు తన సంపదను వధువు వద్ద ప్రదర్శించడానికి, ఆమెను పెంచినందుకు అత్తింటివారికి సొమ్ములు ముట్టజెప్పే సంప్రదాయం ఉంది. దీనిని ‘కైలీ’ అంటారు. మన దగ్గర అయితే పెళ్లి సమయంలో వధువే వరుడుకు సొమ్ములు ఇస్తుంది..మనం దాన్ని కట్నం అంటాం.. చైనాలో జరిగే మూడొంతుల పెళ్లిళ్లలో కైలీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇందుకోసం వరుడి కుటుంబాల్లో వార్షికాదాయానికి దాదాపు కొన్ని రెట్ల మొత్తం వధువు కుటుంబీకులకు చెల్లించాలి. ఇప్పటికే పలు మార్లు ఈ సంప్రదాయాన్ని అడ్డుకొనేందుకు చైనా యత్నించింది.
దేశంలో ఆర్థిక మందగమనం కారణంగా పెళ్లిళ్ల వ్యవహారం ఖరీదై పోయింది. ఇప్పటికే దేశంలో చాలా తక్కువ మంది పెళ్లిళ్లు చేసుకొని సంతానాన్ని కంటున్నారు. ఈ పరిస్థితికి ‘కైలీ’ కారణమని భావిస్తున్నారు. జనవరిలో సెంట్రల్ హుబే ప్రావిన్స్‌లో అధికారులు కైలీ విధానం అమలు చేసేవారిపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాదు జింగ్సి నగరంలో కైలీ అడగబోమని యువతుల చేత సంతకాలు చేయించారు. ఉమెన్స్ డే సందర్భంగా జింగ్షూ ప్రావిన్స్ రాజధానిలో సామూహిక వివాహాలను కూడా ఏర్పాటు చేశారు.
జనాభా రేటు పెంచేందుకు చైనా తిప్పలు..
మరోవైపు జననాల రేటు పెంచేందుకు చైనాలో కొత్త పాలసీలను తీసుకొస్తున్నారు. సంతానం కన్నవారికి సబ్సిడీలు ఇవ్వడం, పెళ్లిళ్లకు అదనపు లీవ్‌లు ఇవ్వడం లాంటివి చేస్తుంది.. దీంతోపాటు పెళ్లిచేసుకోని జంటలు తమ సంతానాన్ని రిజిస్టర్ చేసుకొనే అవకాశం కూడా ఇస్తున్నారు. కానీ, ఈ నిర్ణయాలు పురుషులకు అనుకూలంగా ఉన్నాయని.. సమాజంలో స్త్రీలకు ఉన్న ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు జిన్‌పింగ్ సర్కారు యత్నిస్తోందనే ఆరోపణలు అక్కడ ఉన్నాయి. చైనాలో కొన్ని చోట్ల వరుడి కుటుంబీకులు సొమ్ము తీసుకొనే సంప్రదాయం కూడా ఉంది. కానీ, అధికారులు దానిపై దృష్టిపెట్టకపోవడాన్ని తప్పుపడుతున్నారు.
చైనాలో వన్‌ఛైల్డ్ పాలసీని అమలు చేసిన సమయంలో కైలీ విధానం అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో పురుషుల సంఖ్య గణనీయంగా పెరిగింది..స్త్రీల సంఖ్య తగ్గింది. దీంతో వధువు కుటుంబీకులు భారీ స్థాయిలో సొమ్మును ఆశించడం మొదలుపెట్టారు. తమ జనాభా ఇటీవలి కాలంలో తొలిసారిగా తగ్గినట్లు చైనా ప్రకటించింది. 2021 కంటే 2022 చివరినాటికి తమ దేశ జనాభా 8.50 లక్షలు తగ్గిందని అక్కడి నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌బీఎస్) తెలిపింది. 95.6 లక్షల జననాలు, 1.04 కోట్ల మరణాలు ఉండటంతో చైనా మొత్తం జనాభా 141.18 కోట్లుగా ఖరారు చేశారు.