శ్రాద్ధం పెడితే పెద్దలకు చేరుతుందా.. పరమాచార్య చెప్పిన సత్యం ఇదే!!

-

మహాలయ పక్షాలు చివరి అంకానికి వచ్చాయి. శనివారం అమావాస్యతో పితృపక్షాలు పూర్తవుతాయి. ఆ రోజు అందరూ తమ పెద్దల పేరుతో తర్పణాలు, దానాలు, సంతర్పణలు చేస్తారు. కానీ నేటి రోజుల్లో పెద్దలు చేసే కార్యాలపై పలు సందేహాలు వస్తుంటాయి. సరిగ్గా శ్రాద్ధం, పిత్రుదేవతలకు చేసే తద్దినాలపై అనుమానాలను ఒక భక్తుడు అడుగగా నడిచే దైవంగా పిలవబడే కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి చెప్పిన కథ ఆయన పరమాచార్య ఉపన్యాసముల సంగ్రహం నుంచి.. మహాలయ పక్షం ప్రాశస్త్యం గురించి కంచి పరమాచార్య స్వామివారు ఓ సందర్భంలో ఇలా వివరించారు.

ప్రతి మానవుడు నాలుగు యజ్ఞాలు పాటించాల్సి ఉంటుంది. పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం, దేవ యజ్ఞం, భూత యజ్ఞం. వైదిక ధర్మానుసారం వీటిని ఆచరించినపుడు మనుష్య జన్మకు సార్థకత చేకూరుతుంది. రోజుకు కనీసం ఒక అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వడం మనుష్య యజ్ఞం. వేద పఠనం, శ్రవణం దేవయజ్ఞం. అన్ని ప్రాణుల యందు ప్రేమ, దయ కలిగి ఉండటం భూత యజ్ఞం. పితృ దేవతలకు పిండ ప్రదానం చేయడం, వారి పేరిట దానధర్మాలు చేయడం, తిలోదకాలు సమర్పించడం పితృయజ్ఞం.
మార్గం ఉంటుంది.. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ’ అని వేదోక్తి. తల్లిదండ్రులు దైవసమానులు. వారు ఈ లోకమును వదిలి వెళ్లిన తర్వాత కూడా తప్పకుండా వారికి వైదికంగా శ్రాద్ధకర్మలు చేయాలి. అయితే “మనం సమర్పించే నువ్వులు, నీళ్లు, అన్న పిండాలు, ఫలాలు ఇక్కడే ఉంటాయి కదా..? చనిపోయిన వారు వచ్చి ఎప్పుడు తినలేదు కదా..? పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం వారు మళ్లీ జన్మించి ఉంటే, వారి కోసం ఇవన్నీ చేయడం పిచ్చి పని” అని కొందరి వాదన.

“పట్టణంలో చదువుకుంటున్న కుమారుడికి డబ్బు పంపించడానికి ఓ మోతుబరి రైతు పోస్టాఫీసుకి వెళ్లాడు. అక్కడి గుమాస్తాకు డబ్బులిచ్చి మనియార్డర్‌ ద్వారా తన కొడుక్కు పంపాల్సిందిగా కోరాడు. కాసేపటికి ఆ గుమాస్తా ‘మీ అబ్బాయికి డబ్బు పంపించాము.. రెండుమూడు రోజుల్లో అందుతుంద’ని చెప్పాడు. ఆ రైతుకు నమ్మకం కుదరలేదు. తానిచ్చిన పైకం ఇక్కడే ఉండగా.. డబ్బు తన అబ్బాయికి ఎలా అందుతుందో అర్థం కాలేదు. కానీ అతడి అబ్బాయికి డబ్బు చేరింది. పితృదేవతలకు పిండప్రదానం చేయడమూ ఇలాంటిదే. శాస్త్ర ప్రకారం శ్రాద్ధం శ్రద్ధగా నిర్వర్తిస్తే ఆ ఫలం పితృదేవతలకు అందేలా దేవతలు చేస్తారు. వారు ఆవులుగా పుట్టినట్టయితే భోజనం గ్రాసం రూపంలో అందుతుంది.

వారు ఏ లోకంలో ఉన్నా.. వారి అవసరాలకు తగ్గట్టుగా ఈ ఫలం అందుతుంది. పరాయి ఊళ్లో ఉన్న వ్యక్తికి డబ్బును చేరవేర్చే మార్గం లౌకిక ప్రపంచంలో ఉన్నప్పుడు.. మరో లోకంలో ఉన్న పెద్దలకు శ్రాద్ధఫలం దక్కే మార్గం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండదా..? ప్రేమ, భక్తి, జ్ఞానం వంటి స్థితులకు నియమం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఫలమాశించి చేసే ఏ కర్మకైనా నియమం అవసరం. ఆ నియమాలు తెలిపేదే శాస్త్రం. శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధం తప్పక ఫలితాన్నిస్తుంది. ఇక ఆలస్యమెందుకు స్వామి చెప్పిన కథ అర్థమయ్యిందికదా.. పెత్తరమావాస్య నాడు పెద్దలకు చేసే కార్యక్రమాలను శ్రద్ధతో చేసి వారి అనుగ్రహంతోపాటు పితృదోషాలను తొలగించుకోండి.

– కేశవ

 

Read more RELATED
Recommended to you

Latest news