ఫసల్ బీమా యోజన అందరికీ వర్తింపు చేయాలంటే విధాన పరంగా మార్పు రావాల్సి ఉందని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,444 ఆర్బీకేలు ఉన్నాయని, ప్రతి గ్రామంలో వ్యవసాయ కార్యక్రమాలన్నీ ఆర్బీకేల పరిధిలో జరుగుతాయని ఆయన అన్నారు. అగ్రికల్చర్ అసిస్టెంట్, బ్యాంకింగ్ కరస్పాండెంట్‌లు ఆర్బీకేల్లో పనిచేస్తున్నారని, గ్రామ సచివాలయాలతో కలిసి ఆర్బీకేలు పని చేస్తున్నాయని సీఎం జగన్ తెలిపారు. రైతులు సాగుచేసిన ప్రతి పంటను జియో ట్యాగింగ్‌తో ఇ–క్రాప్ చేస్తున్నాం, రియల్ టైం డేటా ఇదని, చాలా దృఢమైన వ్యవస్థ ద్వారా డేటాను సేకరిస్తున్నామన్నారు సీఎం జగన్. అందుబాటులో ఉన్న ఇ– క్రాప్ డేటాను వినియోగించుకోవాలని, రైతు సాగు చేస్తున్న ప్రతి పంట బీమా పరిధిలోకి తీసుకు వచ్చేందుకు ఉన్న అడ్డంకులను తొలగించామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిందే కాదు, రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని, మూడొంతుల్లో రెండొతులు ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. అందరికీ పంట బీమా పరిహారం అందాలనే లక్ష్యంతో ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోందని, లేకపోతే సాగుచేస్తున్న రైతులందరూ పంటల బీమా పరిధిలోకి రారన్నారు. సన్న, చిన్నకారు రైతులు తరఫున చెల్లించాల్సిన ప్రీమియంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటా భరిస్తే, మరిన్ని అద్భుతాలు జరుగుతాయని, ఈ ఆలోచనపై దృష్టి సారించాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కోరుతున్నానన్నారు. ఫసల్ బీమా యోజనలో కొన్ని రాష్ట్రాలు ఎందుకు లేవన్న అంశం పై దృష్టిపెట్టి, ఆమేరకు మార్గదర్శకాల్లో మార్పులు చేసేందుకు కృషి చేసిన కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు సీఎం జగన్.