రాష్ట్రంలో అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలనను అందిస్తామని జగన్ అన్నారు. ప్రభుత్వం ప్రజలకు చక్కని పాలనను అందించాలంటే.. అందరి సహకారం కావాలని సీఎం జగన్ ఉద్యోగులను కోరారు.
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పాలనలో తనదైన మార్కు చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఓ వైపు ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులపై ఆయన వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇవాళ తొలిసారిగా ఏపీ సచివాలయంలో సీఎం హోదాలో అడుగు పెట్టిన జగన్ గ్రీవెన్స్ హాల్‌లో ఉద్యోగులతో సమావేశమై.. వారిపై వరాల జల్లు కురిపించారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశమైన జగన్ అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామని తెలిపారు. సచివాలయంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా జీతాలు పెంచుతామని తెలిపారు. ఎన్నికలల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగానే ఉద్యోగుల సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకుంటామని, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని సీఎం జగన్ తెలిపారు.
రాష్ట్రంలో అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలనను అందిస్తామని కూడా జగన్ అన్నారు. ప్రభుత్వం ప్రజలకు చక్కని పాలనను అందించాలంటే.. అందరి సహకారం కావాలని సీఎం జగన్ ఉద్యోగులను కోరారు. అలాగే చక్కని పనితీరు ప్రదర్శించే ఉద్యోగులను సత్కరిస్తామని జగన్ అన్నారు. ఇక గత ప్రభుత్వాలతో సన్నిహితంగా పనిచేసిన ఉద్యోగులను తామేమీ తప్పుపట్టబోవడం లేదని, ఉద్యోగులు ప్రభుత్వాల పట్ల సన్నిహితంగా ఉండడం సహజమేనని జగన్ అన్నారు. కాగా ఐఆర్ పెంపుతోపాటు సీపీఎస్ రద్దుపై కూడా రేపు జరగనున్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ తెలిపారు. ఈ క్రమంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ తమ సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తారన్న నమ్మకం తమకు ఉందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.