విశాఖలో లీక్ అయిన విషవాయువులపై ఇప్పుడు రాష్ట్ర ప్రజలను భయపెట్టాయి. తమ వారి కోసం ఇప్పుడు పలు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం వారిని వెంటాడుతుంది. సౌత్ కొరియా కు చెందిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ లాక్ డౌన్ తర్వాత తిరిగి ప్రారంభ౦ అయింది. ఈ సందర్భంగా గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు అందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసారు.
మహిళలు చిన్నారులు అవస్థలు పడుతున్నారు. కొందరు చిన్నారులకు కడుపు నొప్పివచ్చినట్టు తెలుస్తుంది. మరి కొంత మంది కళ్ళు కనపడక బయటకు పరుగులు తీసే క్రమంలో గాయాల పాలయ్యారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు వందల మందిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు అధికారులు. అయితే వారికి ఏ ఇబ్బంది లేదని కలెక్టర్ అంటున్నారు. వారికి ఆక్సీజన్ అందిస్తే తిరిగి కోలుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఊపిరి ఆడకపోవడం దీని సహజ లక్షణం అని చెప్తున్నారు. సిఎం జగన్ కలెక్టర్ తో మాట్లాడి పరిస్థితిని ఆరా తీసారు. వైద్య బృందాలను ఘటనా స్థలాలకు పంపాలి అని, అలాగే కొంత మందిని శ్రీకాకుళం నుంచి కూడా తెచ్చుకోవాలని ఆయన సూచించారు. అటు ఒరిస్సా సిఎం తో కూడా జగన్ మాట్లాడారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే తమకు సహకారం అందించాలి అని జగన్ ఆయన్ను విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది.