గర్భిణీ స్త్రీలకూ కరోనా వాక్సినేషన్ ఇవ్వాలని అధికారులకు సీఎం వైయస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వాక్సినేషన్‌లో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
45 సంవత్సరాలు దాటిన వారికి వాక్సినేషన్ 90 శాతం పూర్తైన తర్వాత… ఉపాధ్యాయులకు, మిగిలిన వారికి వాక్సినేషన్ ఇవ్వాలని ఆదేశించారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు ఇప్పటికే వాక్సినేషన్ ఇస్తున్నామని.. 5 ఏళ్లు దాటిన పిల్లలున్న తల్లులకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా… ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై సీఎం జగన్ కు వివరాలు అందించారు అధికారులు. 97 చోట్ల జరుగుతున్న 134 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల పనుల ప్రగతిని సీఎంకు వివరించారు. 15 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు అధికారులు. రెండు నెలల్లోగా ఉత్పత్తి సామర్ధ్యంతో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల పనులు పూర్తి కావాలి అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.