అమరావతి : పశువులకూ అంబులెన్స్ సేవలను కాసేపటి క్రితమే ప్రారంభించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలను ప్రారంభించిన సీఎం జగన్.. క్యాంప్ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం 10 గంటలకు పూర్తి అయింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 340 పశువుల అంబులెన్స్‌ల ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం.
దీని కోసం సుమారు రూ. 278 కోట్ల వ్యయం చేసిన ప్రభుత్వం… మొదటి దశలో రూ. 143 కోట్ల వ్యయంతో 175 పశువుల అంబులెన్స్‌ల ఏర్పాటు చేసింది. రెండో దశలో రూ. 135 కోట్ల వ్యయంతో త్వరలో మిగిలిన 165 పశువుల అంబులెన్స్‌లు కొనుగోలు చేయనుంది.
ప్రాధమిక వైద్య సేవలతో పాటు సన్న జీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు వీలుగా వాహనాల రూపకల్పన చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ 1962 తో పశు వైద్య టెలి మెడిసిన్ ఏర్పాటు చేసింది సర్కార్. ఒక్కో అంబులెన్స్ మెయిన్‌టెనెన్స్ ఖర్చుల నెలకు 1.90 లక్షలు ఖర్చు చేస్తుండగా.. రెండేళ్ళకు మొత్తం రూ. 155 కోట్ల నిధులు ఖర్చు చేయనుంది ప్రభుత్వం.