అమరావతి : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతూనే ఉంది. మీదంటే.. మీది తప్పు అని ఇరు రాష్ట్రాలు మాటల తుటాలు పేల్చుతున్నాయి. ఆ నేపథ్యంలో సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేవకర్ లకు వేర్వేరుగా లేఖలు రాశారు సీఎం జగన్.
రాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శనకు వస్తామని కృష్ణ బోర్డు తరచు అడగటాన్ని తప్పు పట్టిన సీఎం జగన్.. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించాల్సిందిగా ఏపీ చేసిన అభ్యర్థనను కేఆర్ఎమ్బీ పట్టించుకోవటం లేదని లేఖలో ఆక్షేపించారు.
తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించిన… తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శించే విధంగా ఆదేశించాలని కేంద్ర మంత్రి షెకావత్ ను విజ్ఞప్తి చేశారు సీఎం జగన్. ఉమ్మడి రిజర్వాయర్లలో సాగు, తాగు, విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగాన్ని కృష్ణా బోర్డు పరిధిలోని తీసుకుని రావాలని.. ప్రాజెక్టుల భద్రత పర్యవేక్షణ బాధ్యత సీఐఎస్ఎఫ్ పరిధిలోకి తీసుకుని రావాలని కోరారు. కాగా.. ఇటీవలే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి జల వివాదంపై సీఎం జగన్ లేఖ రాసిన సంగతి విదితమే.