ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే జగన్ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడ వైసీపీ ఎంపీలు ఆయన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోడీతో సీఎం జగన్ సమావేశమై పలు కీలక విషయాల గురించి చర్చించారు. మోడీతో సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌తో సమావేశమయ్యారు.
ఈ సమావేశం సుమారు 20 నిమిషాల పాటు సాగింది. అయితే.. ఈ సమావేశంలో.. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలకు మార్గం సుగమం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. 2017-18 ఆర్ధిక సంవత్సరం ధరల ఆధారంగా పోలవరం ప్రాజక్టు నిర్మాణ వ్యయ అంచనాలకు ఆమోదం తెలిపినట్లు, పునరావాస ప్యాకేజీ కి కూడా కేంద్రం ఆమోదం తెలిపినట్లు సమాచారం. రుణ పరిమితి మేరకు యధావిధిగా ఏపీ రుణాలు పొందేవిధంగా మార్గం సుగమం చేసేందుకు చర్చించినట్లు.. దానిపై నిర్మాలా సీతారామన్ సానుకూలంగా స్పందిచారు. దీంతో.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం పరిమితికి మించి తీసుకున్న 17 వేల కోట్ల రూపాయల రుణంతో సంబంధం లేకుండా, తిరిగి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా రుణం తీసుకునేందుకు అడ్డంకులు తొలిగినట్లు తెలుస్తోంది.