పంచాయతీ ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారట ఆ ఇద్దరు సీనియర్ నేతలు. మెజార్టీ పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని సీఎం ఆదేశిస్తే.. మొత్తం పంచాయతీలను ఏకగ్రీవం చేసి ప్రతిపక్షపార్టీలకు షాకిచ్చారు. వీరి పై టీడీపీ నేతలు ఓ రేంజ్ లో ఫైరవుతూ కోర్టు తలుపు తట్టారు. ఈ వ్యవహారం కాస్త ఎస్‌ఈసీ వద్దకు చేరడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
పంచాయతీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఎస్‌ఈసీకి సహకరిస్తామని స్పష్టం చేసిన ఏపీ సర్కార్.. దానికి అనుగుణంగా ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తూనే.. మరోవైపు ఏకగ్రీవాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని మెజార్టీ గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని స్వయంగా సీఎం జగన్ ఆదేశించారు. ఈ క్రమంలో తొలి రెండు విడతల్లో భారీగానే ఏకగ్రీవాలు నమోదయ్యాయి. మూడో విడతలో కూడా అదే స్థాయిలో 579 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి.
వైసీపీ కీలక నేత చిత్తూరు మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గడచిన రెండు విడతల ఎన్నికల్లోని ఏకగ్రీవాలకు.. మూడో విడతలోని ఏకగ్రీవాలకు చాలా తేడా ఉంది. మొత్తంగా 579 ఏకగ్రీవాలు అయితే.. వీటిల్లో 162 ఏకగ్రీవాలు రెండు నియోజకవర్గాలకు చెందినవే. మూడో విడతలో జరిగిన ఏకగ్రీవాల్లో 28 శాతం పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాలవే.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో మూడో విడతలో 85 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఈ మొత్తం పంచాయతీలు ఏకగ్రీవాలయ్యాయి. అలాగే గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మూడో విడతలో 77 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వాటిల్లో 74 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో సీఎం జగన్ చెప్పిన మాటలను.. ఆదేశాలను తూచా తప్పకుండా పాటించిన వారి జాబితాలో మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అగ్ర భాగంలో నిలిచారు.
మొత్తానికి మొత్తం ఏకగ్రీవాలంటే.. బలవంతం కాక మరేమిటీ అంటూ కోర్టుకెళ్లింది టీడీపీ. ఈ అంశంపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్‌ఈసీకి కోర్టు రిఫర్ చేసింది. దీంతో పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాల వ్యవహరం కోర్టుకు చేరింది. అయితే ఇదే అంశంపై ప్రతిపక్షం పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను పోటికి దిగే అవకాశం లేకుండా రకరకాల ఒత్తిళ్లకు గురి చేయడంతో పాటు.. మంత్రి పెద్దిరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది టీడీపీ.