గ్రేటర్ కార్పొరేటర్ల పై అనర్హత కత్తి వేళ్లాడుతోందా ?

Join Our Community
follow manalokam on social media

ఊహించని స్పీడుతో గ్రేటర్ ఎన్నికలొచ్చాయి. అంతే స్పీడుతో ఎన్నికలు పూర్తై ఫలితాలు వచ్చాయి. కానీ కార్పోరేటర్లు మాత్రం గెలిచిన రెండు నెలల తర్వాత ఊపిరి పీల్చుకున్నారు..గ్రేటర్ పాలకవర్గం ఏర్పడ్డా కొందరు కార్పోరేటర్లకు మాత్రం అనర్హత భయం పట్టుకుందట..కార్పొరేటర్‌ పదవి మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతుందా అని టెన్షన్ పడుతున్నారట..ఓ నలుగురు కార్పొరేటర్లు అనర్హతవేటు భయంతో టెన్షన్ పడుతున్నారట. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి.. తప్పుడు అఫిడవిట్లు సమర్పించి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారన్నది వారిపై ఉన్న అభియోగం.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పాలకమండలి కొలువు తీరడంతో కుదుటపడ్డ కార్పోరేటర్లలో కొత్త భయం పట్టుకుంది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు పోటీకి అనర్హులు. ఈ అంశంపై గ్రేటర్ ఎన్నికల సమయంలోనే దుమారం రేగింది. ఘాన్సీ బజార్‌ బీజేపీ అభ్యర్థి, గాజులరామారం కాంగ్రెస్‌ అభ్యర్థిల పై ఇవే ఆరోపణలు రావడంతో.. వారి నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. కోర్టు నుంచి స్టే తెచ్చుకుని పోటీ చేసినా ఓడిపోయారు. అది ముగిసిన అధ్యాయంగా అంతా భావించారు. కానీ.. గెలిచిన నలుగురు కార్పొరేటర్లపై ఇదే విధమైన ఆరోపణలు వెల్లువెత్తడం తో.. వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు తలుపు తట్టారు ప్రత్యర్థులు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్లలో ముగ్గురు బీజేపీ.. ఒకరు టీఆర్‌ఎస్‌కు చెందిన వారు ఉన్నారు. జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌ వెంకటేష్‌, జాంబాగ్‌ కార్పొరేటర్‌ రాకేశ్‌ జైస్వాల్‌, హస్థినాపురం కార్పొరేటర్‌ సుజాతతోపాటు కుత్బుల్లాపూర్‌ కార్పొరేటర్‌ పారిజాతం ఈ జాబితాలో ఉన్నారు. పారిజాతం మినహా మిగతా వారు బీజేపీ కార్పొరేటర్లు. ఈ నలుగురికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు సేకరించామని చెబుతున్నారు ఓడిన ప్రత్యర్థులు.

ఓడిన నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో.. ఈ పిటిషన్లపై 3నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఎన్నికల ట్రైబ్యునళ్లను ధర్మాసనం ఆదేశించింది. గతంలో ఇలాంటి ఆరోపణలు వస్తే కోర్టుల్లో విచారణ సంవత్సరాల తరబడి సాగేది. ఈలోగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి పదవీకాలం కూడా పూర్తయ్యేది. ఇప్పుడు హైకోర్టు 3 నెలల్లోనే విచారణ పూర్తి చేయాలని ఆదేశించడంతో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది.

గెలిచిన ఈ నలుగురు కార్పొరేటర్లకు ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్టు రుజువైతే అనర్హత వేటు పడుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తమకు ఇద్దరు పిల్లలే ఉన్నారని అభ్యర్థులు అఫిడ్‌విట్‌ దాఖలు చేయడం.. ఉద్దేశపూర్వకంగా మోసం చేయడమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడ బీ ఫారాలు ఇచ్చినప్పుడు పార్టీ నేతలు ఏం చేశారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికి రెడీమేడ్‌ ఆన్సర్లు ఆయా పార్టీల దగ్గర ఉన్నాయి. అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారా ఇంకా ఎక్కువ మంది ఉన్నారా అని చెక్‌ చేసే టైమ్‌ లేదని బదులిస్తున్నారు.

తమ కార్పొరేటర్లు ఏం చెబుతారో విని కోర్టులో ఫైట్‌ చేస్తామని.. ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉంటే.. రెండో స్థానంలో నిలిచినవారిని విజేతగా ప్రకటించకుండా మళ్లీ ఎన్నికలకు వెళ్లేలా ఆదేశించాలని కోర్టును కోరతామని వెల్లడిస్తున్నారు.

TOP STORIES

చెప్పినట్టుగానే బీహార్ లో ఫ్రీ కరోనా వ్యాక్సిన్…!

బీహార్ ప్రభుత్వం ఫ్రీగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ని అందిస్తోంది. బీహార్ స్టేట్ లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వాక్సిన్ ఫ్రీ గా వేయడానికి...